విలేకరులమని చెప్పుకుని ప్రజలను బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితులను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…
గుంటూరు జిల్లాకు చెందిన శివనాగ ప్రశాంత్, విజయవాడకు చెందిన నాగాంజనేయులు ఇటీవల తాడేపల్లి ప్రాంతంలోని ఓ రేషన్ షాప్‌కు వెళ్లారు. తామే విలేకరులమని పరిచయం చేసుకుని, రేషన్ డీలర్‌పై వార్తలు రాస్తామని బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనపై అనుమానం కలిగిన రేషన్ డీలర్ వెంటనే తాడేపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు బెదిరింపులకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో, ఆదివారం వారిని అరెస్ట్ చేశారు.
ప్రజలను బెదిరించి, తప్పుడు విలేకరులుగా నటిస్తూ డబ్బులు వసూలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే ప్రజలు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.



