దేశవ్యాప్తంగా పెరుగుతున్న వీధికుక్కల బెడదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యంపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఇప్పటికీ పలు రాష్ట్రాలు చర్యల నివేదికలు సమర్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, “మీ అలసత్వం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది” అని వ్యాఖ్యానించింది.
సోమవారం వీధికుక్కల దాడులు, ప్రజల భద్రతకు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా, కోర్టు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. “దేశంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మీరు తీసుకున్న చర్యల వివరాలు ఎక్కడ? ఎందుకు నివేదికలు ఇవ్వడం లేదు? ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల భారత్ ఇమేజ్ దెబ్బతింటోంది” అని ధర్మాసనం రాష్ట్రాల న్యాయవాదులను ప్రశ్నించింది.
వీధికుక్కల సమస్య దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని, ఇది కేవలం కొద్ది ప్రాంతాలకు పరిమితం కాదని కోర్టు గుర్తుచేసింది. పిల్లలు, వృద్ధులు తరచుగా దాడులకు గురవుతున్నారని, ప్రజల ప్రాణ భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని హెచ్చరించింది. జంతువుల హక్కులను రక్షించడమూ, మనుషుల భద్రతను కాపాడడమూ రెండు సమానంగా ముఖ్యమని, అందుకోసం సమతుల్యమైన పరిష్కారం అవసరమని సుప్రీంకోర్టు సూచించింది.
తదుపరి విచారణకు ముందే రాష్ట్రాలు తీసుకున్న చర్యల పూర్తి నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఇకపై ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ విచారణను వాయిదా వేసింది.



