కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్–2026 ద్వారా BSF, CISF, CRPF, SSB, ITBP, Assam Rifles, SSF, NCB విభాగాల్లో మొత్తం 25,487 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై ఉండగా, ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.
ఈ ఉద్యోగాలకు టెన్త్ ఉత్తీర్ణత కలిగి, 01-01-2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. మొత్తం ఖాళీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి 1,105 పోస్టులు ఉండడం విశేషం.
అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే, జనవరి 8, 9, 10 తేదీల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అప్లికేషన్ ఫీజు రూ.100గా నిర్ణయించారు (మినహాయింపులు వర్తిస్తాయి).
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపికను
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- మెడికల్ ఎగ్జామినేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఆధారంగా నిర్వహిస్తారు. CBT పరీక్షలను 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు SSC వెల్లడించింది.
ప్రత్యేక వెయిటేజ్: NCC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు ఉంటాయి.
- NCC ‘A’ సర్టిఫికెట్‌కు 2%
- NCC ‘B’ సర్టిఫికెట్‌కు 3%
- NCC ‘C’ సర్టిఫికెట్‌కు 5% మార్కులు జత చేస్తారు.
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని SSC సూచించింది. పూర్తి నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ వివరాల కోసం https://ssc.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.



