శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు సముద్ర తీరంలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. సుమారు 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెంది సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. తీరమంతా చలనం లేకుండా పడి ఉన్న ఆ తాబేళ్ల మృతదేహాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లుగా కనిపించాయి. ఈ దృశ్యం చూసిన వారిలో మానవత్వంపైనే ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది.
మృతి చెందిన తాబేళ్లను చూసి చలించిన స్థానిక స్నేహ కళామండలి సభ్యులు వాటికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రత్యేకంగా గుంతలు తవ్వించి తాబేళ్లను పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు సంఘటనా స్థలానికి చేరుకుని తాబేళ్లకు నివాళులు అర్పించారు. పర్యావరణ పరిరక్షణకు నిర్లక్ష్యం కొనసాగితే జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలు కొత్త విషయం కాదని, ఏండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా వాటి సంరక్షణపై సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
శ్రీకాకుళం తీర ప్రాంతంలో వాతావరణం, ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండటంతో ప్రతి ఏడాది ఆలివ్ రిడ్లీ తాబేళ్లు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు సుమారు 978 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఇవి సంతానోత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా వజ్రపుకొత్తూరు, పలాస, బారువ ప్రాంతాలతో పాటు విశాఖపట్నం జిల్లాలోని ఆర్.కె.బీచ్, భీమిలి, సాగర్‌నగర్ తీరాల్లో నవంబర్ నుంచి మే నెలల వరకు తాబేళ్లు గుడ్లు పెడతాయని వెల్లడించారు.
అయితే ప్లాస్టిక్ వలలు, అధిక వేగంతో నడిచే బోట్లు ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సంప్రదాయ వలల్లో చిక్కుకున్న తాబేళ్లను మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి వదిలేవారని, కానీ ప్లాస్టిక్ వలల్లో చిక్కుకున్న తాబేళ్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయని చెబుతున్నారు. 2022 మార్చిలో కూడా వందలాది తాబేళ్లు మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, ఇకనైనా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యం జరిగితే అరుదైన ఈ జీవజాతి ఉనికే ప్రమాదంలో పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.



