కొత్త ఫోన్లలో సంచార్ సాథీ ప్రీలోడ్ తప్పనిసరి – కేంద్రం కీలక ఆదేశాలు

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం భారీ స్థాయిలో పెరుగుతున్న కొద్దీ, సైబర్‌ భద్రతపై ఉన్న ఆందోళనలు కూడా మరింత తీవ్రమవుతున్నాయి. లక్షలాది యాప్‌లు, అనేక రకాల సేవలు… వీటిపై ఆశ్రయించిన వినియోగదారులు తెలియకుండానే సైబర్‌ నేరగాళ్ల దాడులకు గురవుతూ, తమ డేటా, డబ్బు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న ముప్పును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర టెలికాం శాఖ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం, దేశంలో తయారయ్యే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీలోడ్‌ చేసి ఇవ్వాలి. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ యాప్‌ ద్వారా మోసపూరిత లింకులు, అనుమానాస్పద కాల్స్, ప్రమాదకరమైన మెసేజ్‌లను ముందుగానే గుర్తించి నిరోధించవచ్చు. ఈ ఆదేశాలను 90 రోజుల్లో తప్పనిసరిగా అమలు చేయాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో ఒకటి భారత్. ఇదే మార్కెట్‌ ఇప్పుడు సైబర్‌ నేరాలను ఎదుర్కొంటున్న ప్రధాన కేంద్రంగా మారింది. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు—ఎవ్వరూ సైబర్‌ మోసాల నుండి మినహాయింపులో లేరు. ఇటీవలి కాలంలో కోట్ల రూపాయలు ఈ రకమైన ఆన్‌లైన్‌ మోసాల్లో ఎగిరిపోయిన ఉదాహరణలు అనేకం. ఈ నేపథ్యంలో ప్రతి ఫోన్‌లో సంచార్ సాథీని ముందే అందుబాటులో ఉంచడం ద్వారా వినియోగదారుల భద్రతను పెంపొందించడమే కేంద్ర లక్ష్యం.

అయితే, ఈ నిర్ణయంపై అన్ని సంస్థలు ఒకే విధంగా స్పందించే అవకాశం లేదు. ప్రత్యేకంగా ఆపిల్‌ విషయంలో పరిస్థితి క్లిష్టంగా మారవచ్చు. తమ ఇకోసిస్టమ్‌లో థర్డ్ పార్టీ యాప్‌లను అనుమతించని ఆపిల్, ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తుందన్నది పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా, ఆపిల్, శాంసంగ్, జియోమీ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటివరకు ఈ ఆదేశంపై అధికారిక వ్యాఖ్యలు చేయలేదు.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్‌ ముప్పుల దృష్ట్యా సంచార్ సాథీని తప్పనిసరిగా చేయాలన్న కేంద్ర నిర్ణయం—మొబైల్‌ తయారీ రంగంలో ఒక కీలక మార్పుగా నిలిచే అవకాశం ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి