పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో జగన్‌పై నమోదు చేసిన చర్యలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
రెంటపాళ్లలో ఇటీవల జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్ధుడు ఆయన కాన్వాయ్ కిందపడి మృతిచెందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి వీడియో బయటపడటంతో, పోలీసులు జగన్ సహా పలు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టివేయాలని జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు రాజకీయ కక్షతోనే పెట్టారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్‌తో పాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు విడదల రజిని, పేర్ని నానిలు కూడా హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు, జూలై 1వ తేదీన విచారణ జరిపి, కేసు తదుపరి చర్యలపై తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ ఉత్తర్వులతో వైఎస్ జగన్‌తో పాటు ఇతర వైసీపీ నేతలకు తాత్కాలిక ఊరట లభించినట్లు చెప్పొచ్చు.