వెండి ధరలు భారీగా పడిపోతాయా? గత చరిత్రతో విశ్లేషకుల హెచ్చరిక

వెండి ధరలు చూస్తే పెట్టుబడిదారులకు ఒక్కసారిగా దడే. ఇప్పటికే కొన్నవాళ్లకు మాత్రం ఇదే పండుగ. కానీ ఇప్పుడు కొనాలనుకునే వారికి మాత్రం ఫికర్ తప్పడం లేదు. లక్ష దాటింది, రెండు లక్షలు దాటింది, ఇంకో పాతిక వేలు కూడా జోడించి ర్యాపిడ్ మోడ్‌లో పరుగులు తీస్తోంది వెండి ధర. అయితే ఇంత దూసుకెళ్లిన వెండి, త్వరలోనే కిందపడే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ పరిణామాలే కారణం

సాధారణంగా భారత మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగాలంటే అంతర్జాతీయ మార్కెట్లలో కీలక మార్పులు జరగాల్సిందే. ప్రస్తుతం అదే జరుగుతోంది. అంతర్జాతీయ ట్రేడింగ్ పరిణామాలు, ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడం, లాంగ్ పొజిషన్ల నుంచి వెనక్కి తగ్గడం వల్ల గోల్డ్, సిల్వర్ ధరల్లో క్షీణత కనిపిస్తోంది.
ఈ ఏడాది అంతర్జాతీయంగా బంగారం సుమారు 66 శాతం పెరిగినప్పటికీ, ఇప్పుడు కొంత తగ్గుదల మొదలైంది.

సిల్వర్ ఇచ్చిన భారీ లాభాలు

గత ఏడాది వెండిలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం భారీ లాభాలే వచ్చాయి. ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టిన వారు ఇప్పుడు దాదాపు 2 లక్షల 15 వేల రూపాయల వరకు సంపాదించగలిగారు. అంటే వంద శాతం పైగా రిటర్న్ వచ్చింది. ఈ లాభాలే ఇప్పుడు వెండిపై మరింత ఆసక్తిని పెంచాయి.

గత చరిత్ర చెబుతున్న హెచ్చరిక

అయితే గతాన్ని పరిశీలిస్తే వెండి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండలేదు. ప్రతి సారి భారీగా పెరిగిన తర్వాత, గట్టిగానే పతనమయ్యాయి.

  • 1980లో ఔన్స్ వెండి ధర 50 డాలర్ల నుంచి 5 డాలర్లకు పడిపోయింది
  • 2011లో 48 డాలర్ల నుంచి 12 డాలర్లకు తగ్గింది
  • 2020లో 30 డాలర్ల నుంచి 18 డాలర్లకు చేరింది

ఈ ఉదాహరణలను చూస్తే, గతంలో 40 నుంచి 90 శాతం వరకు వెండి ధరలు క్షీణించిన సందర్భాలు ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

ఇక ముందు ఏం జరగొచ్చు?

ప్రస్తుతం పారిశ్రామిక అవసరాలు, చైనా ఎగుమతి ఆంక్షలు వెండి ధరలను పైకి నడిపిస్తున్నాయి. కానీ ఇవే పరిస్థితులు ఎప్పటికీ కొనసాగవని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. క్రమంగా డిమాండ్ తగ్గితే, ధరలు దిగివచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇన్వెస్టర్లకు సూచన

ఇప్పటికే వెండిలో పెట్టుబడి పెట్టిన వారు లాభాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మాత్రం కాస్త ఆగడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్ స్థిరపడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం సురక్షితమని అంటున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి