ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. డీజీపీకి రాజీనామా లేఖ పంపిన ఆయన, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలతో తీసుకున్నదని స్పష్టం చేశారు. “ఒత్తిళ్లు వల్ల కాదు, ఇది నా స్వంత నిర్ణయం” అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా పనిచేస్తున్న సిద్ధార్థ్, గతంలో కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల మీడియా వర్గాల్లో ఆయనపై ఒత్తిళ్లు వచ్చాయని వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో, ఆయన స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసి స్పష్టత ఇచ్చారు.
“ఈ నిర్ణయం ఎలాంటి దబాయింపు లేకుండా, నా వ్యక్తిగత ఆలోచనలు, కుటుంబ అభిప్రాయాలతో తీసుకున్నది. ఇది నా జీవన మార్గాన్ని మార్చుకునే ఒక కొత్త అధ్యాయం” అని చెప్పారు.
సిద్ధార్థ్ కౌశల్ తన ఐపీఎస్ జీవితాన్ని ఎంతో గౌరవంగా గుర్తు చేసుకున్నారు. “ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయడం నా అదృష్టం. ఈ రాష్ట్రాన్ని నా ఇంటిలా భావిస్తాను. ఇక్కడి ప్రజలు ఎప్పటికీ నా మనసులో ఉంటారు” అని ఆయన అన్నారు.
రాబోయే కాలంలో సమాజానికి కొత్త రూపంలో సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. తనకు తోడుగా ఉన్న ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.