సముద్రంలో ఇంత బంగారం ఉందా? బయటకి తీస్తే ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి 4 కిలోల బంగారం వస్తుందా?

బంగారం… ఈ మాట వినగానే మనసులో మెరుపు మెరిసిపోతుంది. రాజుల కాలం నుంచి నేటి సామాన్యుడి వరకూ బంగారం అంటే అందరికీ ప్రత్యేక ఆకర్షణే. సంపదకు, భద్రతకు, గౌరవానికి ప్రతీకగా బంగారాన్ని భావిస్తారు. కానీ భూమి మీద గనుల్లో మాత్రమే కాదు… మన కళ్ల ముందే విస్తరించి ఉన్న సముద్ర గర్భంలో లక్షల కోట్ల విలువైన బంగారం దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు.

ప్రపంచ దేశాలు తమ ఆర్థిక భద్రత కోసం భారీగా బంగారు నిల్వలు ఉంచుకుంటున్నాయి. భూగర్భ గనుల్లో బంగారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మైనింగ్ చేస్తుంటాయి. అయితే శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, భూమిపై ఉన్న అన్ని గనులకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బంగారం సముద్ర జలాల్లో కలిసిపోయి ఉంది. దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం సముద్రాల్లో ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

భూమి మీద సుమారు 70 శాతం విస్తీర్ణం నీటితో కప్పబడి ఉంది. ఆ నీలి సముద్రాలు కేవలం ఉప్పు నీటి నిల్వలు మాత్రమే కావు. అవి అనేక ఖనిజాలు, విలువైన లోహాలకు నిలయంగా ఉన్నాయి. అందులో బంగారం కూడా ఒకటి. సముద్రాల్లో ఉన్న మొత్తం బంగారాన్ని వెలికి తీసి ప్రపంచ జనాభాకు సమానంగా పంచితే, ఒక్కొక్కరికి సగటున నాలుగు కిలోల బంగారం దక్కుతుందని శాస్త్రవేత్తలు లెక్క కడుతున్నారు.

అయితే ఈ సంపద మనకు అందుబాటులోకి రాకపోవడానికి ప్రధాన కారణం దాని రూపమే. సముద్రంలో బంగారం కనిపించే ముక్కలుగా ఉండదు. అది నీటిలో కరిగిపోయిన అత్యంత సూక్ష్మ కణాలుగా ఉంటుంది. మనిషి రక్తంలో బంగారం అతి తక్కువ పరిమాణంలో ఉన్నట్టే, సముద్రపు నీటిలో కూడా బంగారం అతి సూక్ష్మ నిష్పత్తిలో కలిసిపోయి ఉంటుంది. ఒక గ్రాము బంగారం పొందాలంటే దాదాపు 100 మిలియన్ మెట్రిక్ టన్నుల సముద్రపు నీటిని శుద్ధి చేయాల్సి వస్తుంది. ఇంత తక్కువ నిష్పత్తి కారణంగా బంగారాన్ని వేరు చేయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన పనిగా మారింది.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ తీవ్రమైన అప్పుల సంక్షోభంలో చిక్కుకుంది. ఆ అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో సముద్రపు నీటిలో నుంచి బంగారం వెలికితీయాలనే ఆలోచనకు రూపం ఇచ్చింది. ఈ పరిశోధనకు ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ నాయకత్వం వహించారు. అయితే ప్రయోగాల్లో ఒక నిజం బయటపడింది. ఒక గ్రాము బంగారం తీయడానికి అయ్యే ఖర్చు, ఆ బంగారం మార్కెట్ విలువ కన్నా వంద రెట్లు ఎక్కువ. అంటే లక్షలు ఖర్చు చేసి వేల రూపాయల విలువైన బంగారం మాత్రమే పొందే పరిస్థితి. దీంతో ఆ ప్రాజెక్ట్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.

సముద్రపు నీటిలోనే కాదు, సముద్ర గర్భంలోని రాళ్లలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. కానీ మైళ్ల లోతుకు వెళ్లి మైనింగ్ చేయడం ప్రాణాంతకమే కాకుండా, అక్కడి జీవ వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతుంది. సముద్ర గర్భాన్ని తవ్వడం వల్ల అరుదైన జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రకృతికి తిరిగి పూడ్చలేని నష్టం. అందుకే సముద్రపు బంగారం ఇప్పటికీ అందని సంపదగానే మిగిలిపోయింది.

అయితే భవిష్యత్తులో నానోటెక్నాలజీ, లేదా ప్రత్యేక బ్యాక్టీరియా ఆధారిత పద్ధతులు అభివృద్ధి అయితే తక్కువ ఖర్చుతో సముద్రపు బంగారాన్ని వెలికితీయగల అవకాశాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అప్పటి వరకు లక్షల కోట్ల విలువైన ఆ బంగారం సముద్ర గర్భంలోనే నిశ్శబ్దంగా నిద్రపోతూనే ఉంటుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి