సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులపై ఘోర విషాదం చోటుచేసుకుంది. మక్కా నుండి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ భయానక ఘటన సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ముఫ్రిహాట్ ప్రాంతం వద్ద జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు మృతి చెందినట్లు తెలిసింది. బస్సులో మహిళలు, చిన్నారులు సహా పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు చెందిన యాత్రికులు ఉన్నట్లు ధృవీకరణ వస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు బస్సులో ఉన్నారని సమాచారం.
ఉమ్రా యాత్ర పూర్తిచేసుకొని మక్కా నుంచి మదీనాకు బయలుదేరిన ప్రయాణికులు బస్సులో నిద్రలో ఉన్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఢీకొన్న తీవ్రత కారణంగా బస్సు పూర్తిగా దెబ్బతింది.
అధికారులు ఇప్పటికీ మృతుల ఖచ్చిత సంఖ్య మరియు క్షతగాత్రుల స్థితిపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ సంఘటన సౌదీ, హైదరాబాద్ సహా భారతదేశంలోని యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.



