సౌదీ అరేబియా గుహల్లో 4200 ఏళ్ల నాటి చిరుతల మమ్మీలు.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన అరుదైన ఆవిష్కరణ

ప్రపంచ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యంలో ముంచెత్తే అరుదైన ఆవిష్కరణ ఒకటి సౌదీ అరేబియాలో వెలుగులోకి వచ్చింది. దేశ ఉత్తర భాగంలో ఉన్న ‘లౌగా కేవ్ నెట్‌వర్క్’ ప్రాంతంలో 2022–2023 మధ్య కాలంలో నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ బృందం విస్తృత స్థాయి సర్వే చేపట్టింది. గబ్బిలాలు, కీటకాలు, ఇతర జీవవైవిధ్యంపై అధ్యయనం చేయడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పరిశోధన, చివరకు చిరుతల చరిత్రనే తిరగరాసే అంశానికి దారి తీసింది.

సర్వే సందర్భంగా ఐదు వేర్వేరు గుహల్లో మొత్తం 61 చిరుతల అవశేషాలు బయటపడ్డాయి. వాటిలో ఏడు చిరుతలు సహజసిద్ధంగా ‘మమ్మీలు’గా మారిపోయి ఉండటం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – ఈ మమ్మీ చిరుతల చర్మం, గోళ్లు, పళ్లు, వెంట్రుకలు కూడా చెక్కుచెదరకుండా ఉండటం.

సహజసిద్ధమైన మమ్మీలు

గుహల్లో ఉండే పొడి గాలి, స్థిరమైన ఉష్ణోగ్రత, చల్లని వాతావరణ పరిస్థితులే ఈ సహజ మమ్మీ ప్రక్రియకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షల ప్రకారం, ఈ అవశేషాలు 100 ఏళ్ల నుంచి దాదాపు 4,200 ఏళ్ల నాటివిగా నిర్ధారణ అయ్యాయి. అత్యంత పురాతనమైన చిరుతల అస్థిపంజరాలు సుమారు 4,000 ఏళ్ల క్రితం నాటివి కాగా, మమ్మీ రూపంలో లభించిన కొన్ని చిరుతలు 1,800 నుంచి 2,000 ఏళ్ల వయస్సు కలవిగా తేలాయి.

అరేబియన్ ద్వీపకల్పంలో పెద్ద పిల్లి జాతికి చెందిన జంతువులు ఈ విధంగా సహజసిద్ధంగా మమ్మీలుగా దొరకడం ఇదే తొలిసారి. “ఇది పూర్తిగా ఊహించని పరిణామం. చిరుతలు గుహల్లో నివసించేవని మాకు ఎలాంటి ఆధారాలు లేవు. గతంలో ఇలాంటి రికార్డులు ఎప్పుడూ కనిపించలేదు” అని పరిశోధన బృందం నాయకుడు అహ్మద్ బౌగ్ వెల్లడించారు. 1970వ దశకంలోనే అరేబియా ప్రాంతంలో చిరుతలు అంతరించిపోయిన నేపథ్యంలో, ఈ ఆవిష్కరణకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

అడవి కాదు… గుహలే చిరుతల నివాసాలు

గుహల్లో చిరుతల మలం, అవి వేటాడి తిన్న జంతువుల ఎముకలు, వేర్వేరు వయస్సుల పిల్లల అవశేషాలు లభించడాన్ని బట్టి, చిరుతలు ఈ గుహలను తాత్కాలిక ఆశ్రయాలుగా కాకుండా, దీర్ఘకాల నివాసాలుగా ఉపయోగించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎడారిలో మండే ఎండలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అవి లోతైన గుహల్లో తలదాచుకున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొన్ని గుహల లోతు అంత ఎక్కువగా ఉండటంతో, లోపలికి చేరుకోవాలంటే సుమారు 50 అడుగుల లోతైన సింక్‌హోల్స్‌లో తాడు సాయంతో దిగాల్సి వచ్చింది.

ఈ ఆవిష్కరణతో చిరుతల జీవనశైలిపై ఉన్న పాత అంచనాలు పూర్తిగా మారిపోయాయి. చిరుతలు కేవలం విస్తారమైన మైదాన ప్రాంతాల్లోనే సంచరిస్తాయని భావనకు ఇది గట్టి సవాల్‌గా మారింది. ప్రస్తుతం సౌదీ ప్రభుత్వం ఓరిక్స్, గజెల్ వంటి జంతువులను తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టే కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా లభించిన చిరుతల అవశేషాలపై జరిగిన జెనెటిక్ విశ్లేషణలో, ఇవి ఉత్తర–పశ్చిమ ఆఫ్రికా చిరుతలకు దగ్గరగా ఉన్నట్లు తేలింది.

దీంతో భవిష్యత్తులో ఆ జాతికి చెందిన చిరుతలను తిరిగి ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ఇది కీలక అడుగుగా మారవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. లౌగా గుహల్లో లభించిన ఈ సహజ మమ్మీ చిరుతలు, అరేబియా భూభాగంలోని అడవి జీవచరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయని పరిశోధకులు చెబుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి