సంక్రాంతి పండుగ అంటే చాలు.. గోదావరి జిల్లాలు సందడితో నిండిపోతాయి. ఊరూరా బంధుమిత్రుల రాక, కొత్త అల్లుళ్ల ఆతిథ్యం, సంప్రదాయ వంటకాల హడావుడి మొదలవుతాయి. ఈ క్రమంలో గోదావరి జిల్లాల్లో నాటుకోడి మాంసానికి భారీ డిమాండ్ ఏర్పడింది. పండుగ సీజన్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో నాటుకోళ్ల ధరలు అమాంతం పెరిగాయి.
గోదావరి జిల్లాల్లో నాటుకోడి ప్రత్యేకత
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడి పందేలు ఎంత ఫేమసో.. అక్కడి నాటుకోడి కూర కూడా అంతే ప్రసిద్ధి. పండుగకు ఇంటికొచ్చే అతిథులు, కొత్త అల్లుళ్లకు నాటుకోడితో ప్రత్యేక వంటకాలు చేయడం అక్కడి ప్రజల ఆనవాయితీ. అంతేకాదు, సంక్రాంతి పండుగలో కీలకమైన ముక్కనుమ రోజు స్థానిక గ్రామదేవతలకు నాటుకోడిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సంప్రదాయాల కారణంగా ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
ఒక్క కోడికి 10 నుంచి 20 మంది పోటీ
ఈ ఏడాది సంక్రాంతి దగ్గరపడుతుండటంతో గోదావరి జిల్లాల్లో నాటుకోళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో నాటుకోళ్ల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్క నాటుకోడి కోసం 10 నుంచి 20 మంది వరకు పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది.
ధరలు రూ. 2500 దాటుతున్నాయా?
డిమాండ్ పెరగడం, సప్లై తగ్గిపోవడంతో నాటుకోళ్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో
- కేజీ నాటుకోడి ధర రూ. 2000 నుంచి రూ. 2500 వరకు పలుకుతోంది.
సాధారణ రోజుల్లో మాత్రం నాటుకోడి ధర రూ. 1000 నుంచి రూ. 1200 మధ్యలోనే ఉంటుంది. కానీ పండుగ సీజన్ కావడంతో ధరలు రెట్టింపు స్థాయికి చేరాయి.
ముందుగానే మెను ఫిక్స్ చేస్తున్న బంధువులు
సంక్రాంతికి విదేశాలు, ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వచ్చే బంధువులు ముందుగానే మెను లిస్ట్ పంపిస్తున్నారు. గోదావరి ఫేమస్ నాటుకోడి మాంసం తప్పనిసరిగా ఉండాలని కోరుతున్నారు. అతిథుల మర్యాదలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు భారీ ధరలు చెల్లించి అయినా నాటుకోడిని కొనుగోలు చేస్తున్నారు.
ధరల పెరుగుదలకు అసలు కారణం ఇదే
నాటుకోళ్ల ధరలు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ఉత్పత్తి తగ్గిపోవడం.
- గత కొన్నాళ్లుగా వైరల్ వ్యాధుల కారణంగా అనేక ప్రాంతాల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి
- భారీ నష్టాలు రావడంతో వ్యాపారులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు
- పల్లెల్లోనూ కోళ్ల పెంపకంపై ఆసక్తి తగ్గింది
దీంతో నాటుకోళ్ల సరఫరా భారీగా తగ్గిపోయింది. ఎక్కడ కొద్దిగా కోళ్లు ఉన్నా అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఇదే అదునుగా భావించి రేట్లు భారీగా పెంచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పండగపూట ముక్కలు కష్టమేనా?
సంక్రాంతి పండుగలో నాటుకోడి వంటకం లేకుండా భోజనం పూర్తవదనే భావన గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది. అయితే ధరలు ఇలా పెరిగితే సామాన్య కుటుంబాలకు పండగపూట ముక్కలు తినడం కష్టమేనా? అనే చర్చ మొదలైంది.



