ఈ సంక్రాంతి కోడి పందెంలో హైలెట్.. తాడేపల్లిగూడెంలో రూ.1.53 కోట్ల భారీ పందెం

సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పందేల క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ఏటా సంక్రాంతి వేళ గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పందెం బరిలో కోళ్లు దిగుతుంటాయి. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం కనిపించగా, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా జరిగిన ఓ భారీ పందెం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సంక్రాంతికి జరిగిన పందేలలో హైలెట్‌గా నిలిచిన ఈ పోటీలో ప్రైజ్ మనీ అక్షరాలా రూ.1.53 కోట్లు. గుడివాడ ప్రభాకర్‌కు చెందిన ‘సేతువ’ పుంజు, రాజమండ్రి రమేశ్‌కు చెందిన ‘డేగ’ పుంజు మధ్య ఈ పోటీ జరిగింది. పైబోయిన వెంకటరామయ్య బరిలో జరిగిన ఈ పోరాటాన్ని చూసేందుకు పందెం రాయుళ్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో రాజమండ్రి రమేశ్‌కు చెందిన డేగ పుంజు విజేతగా నిలిచింది. దీంతో యజమానికి ఏకంగా రూ.1.53 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఈ విజయంతో రమేశ్ పేరు ఇప్పుడు గోదావరి జిల్లాల వ్యాప్తంగా మార్మోగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతి పెద్ద పందెంగా పందెం వర్గాలు చెబుతున్నాయి.

ఇలాంటి పందేలలో మరో ఆసక్తికర విషయం ఏమంటే… కోళ్లను బరిలోకి దించేముందు మంచి ముహూర్తం చూసుకోవడం. పందెం ప్రారంభానికి ముందే టైమ్, ముహూర్తం ఖరారు చేసి, ఆ తర్వాతే కోళ్లను బరిలోకి దింపడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

మొత్తంగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా కోడి పందేల సందడి మామూలుగా లేదు. భోగి రోజునే సుమారు రూ.100 కోట్ల వరకు నగదు చేతులు మారినట్లు అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి రోజున కూడా అంతకు మించిన మొత్తం పందేల రూపంలో చలామణి అయినట్లు తెలుస్తోంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి తెలంగాణ నుంచి భారీగా పందెం రాయుళ్లు గోదావరి జిల్లాలకు రావడం విశేషంగా మారింది.

పండుగకు ముందు కోడి పందేలు, జూదాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా… అవి కాగితాలకే పరిమితమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సంక్రాంతి వేళ కోడి పందేల సంబరాలు మాత్రం యథావిధిగా కొనసాగుతుండటం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి