ఇంకో రెండు రోజుల్లో తెలుగు ఇళ్లల్లో సంక్రాంతి పండగ సందడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు పండుగకు సిద్ధమవుతున్నాయి. ఇంటి ముందర రంగవల్లులు, గ్రామాల్లో కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో ఏపీ, తెలంగాణల్లో వారం రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొననుంది. తెలుగువారికి సంక్రాంతి అతిపెద్ద పండుగ. కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకోవడానికి స్వస్థలాలకు వెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
అయితే కోస్తా జిల్లాల్లో సంక్రాంతి పండగకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కోడిపందేల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడిపందేల నిర్వాహకులకు ఈ ఉత్తర్వులు భారీ షాక్‌గా మారాయి. జూదం, జంతుహింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కోడిపందేలు, పేకాటతో పాటు ఇతర జూదం తరహా కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకోవాలని స్పష్టం చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయడానికీ వెనుకాడొద్దని సూచించింది.
జంతు హింస నిరోధక చట్టం–1960, జూదం నిరోధక చట్టం–1974లను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలవడం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రతి సంక్రాంతికీ కోడిపందేలు జోరుగా సాగుతుంటాయి. ఈ పోటీలను వీక్షించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుంటారు. ఎన్నారైలు సైతం ప్రత్యేకంగా స్వగ్రామాలకు వచ్చి ఈ కార్యక్రమాలను చూడడం, పాల్గొనడం పరిపాటిగా మారింది. సంక్రాంతి నాలుగు రోజుల వ్యవధిలోనే ఇక్కడ కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతాయన్నది బహిరంగ రహస్యమే.



