సకాలంలో చర్యలతో సంగం బ్యారేజీకి ప్రమాదం తప్పింది: హోంమంత్రి వంగలపూడి అనిత

నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీపై తుఫాన్‌ ప్రభావం కారణంగా సంభవించిన ప్రమాదాన్ని అధికారుల సకాలంలో తీసుకున్న చర్యలతో తప్పించగలిగారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మొంథా తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు నదుల్లో నీటి ప్రవాహం పెరగడానికి దారితీశాయని, అయితే అధికారులు చొరవ చూపడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె అన్నారు.

సంగం బ్యారేజీ వద్దకు వరద ప్రవాహంలో కొట్టుకువచ్చిన 35 టన్నుల భారీ బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చినందుకు జిల్లా యంత్రాంగాన్ని, ముఖ్యంగా కలెక్టర్, ఎస్పీ మరియు రక్షణ బృందాలను హోంమంత్రి అభినందించారు. “సమయోచితంగా స్పందించకపోతే ఈ సంఘటన ఒక పెద్ద విషాదంగా మారేది. కానీ అధికారులు సమన్వయంతో పని చేసి ప్రాజెక్టును కాపాడారు,” అని వంగలపూడి అనిత ప్రశంసించారు.


ఏం జరిగిందంటే…

ఇటీవలి వరదలతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం లక్ష క్యూసెక్కుల దాకా పెరిగింది. ఈ సమయంలో 30 టన్నుల బరువున్న ఇసుక బోటు లంగరు తెగిపోవడంతో, అది నేరుగా సంగం బ్యారేజీ గేట్ల వైపు దూసుకెళ్లింది.

భారీ బోటు గేట్లను ఢీకొంటే 85 గేట్లతో నిర్మితమైన సంగం బ్యారేజీకి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉండేది. ఈ ప్రాజెక్టు లక్షలాది ఎకరాల సాగు భూములకు నీరందించే ప్రాణాధారమని అధికారులు పేర్కొన్నారు.

ఈ సమాచారంతో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. నెల్లూరు కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వజ్రేంద్ర, ఇరిగేషన్, ఫైర్ మరియు భద్రతా విభాగాల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

30 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్, 30 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్, 100 మంది పోలీస్ మరియు భద్రతా సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, అలాగే ఇరిగేషన్ మరియు ఫైర్ డిపార్ట్‌మెంట్ బృందాలు సమన్వయంతో చర్యలు చేపట్టాయి. తాళ్ల సహాయంతో బోటును జాగ్రత్తగా ఒడ్డుకు లాగి పెద్ద ప్రమాదాన్ని అడ్డగించారు.

హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, “జిల్లా అధికారులు చూపిన వేగవంతమైన చర్యలతో బ్యారేజీకి ప్రమాదం తప్పింది. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న మా ప్రభుత్వం ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తుంది,” అని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి