టాలీవుడ్ ప్రముఖ నటి సమంత తన వ్యక్తిగత జీవితంలో ఓ కీలక మలుపు తిరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగినట్టు సంబంధిత వర్గాల సమాచారం. కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా ఆధ్యాత్మిక కేంద్రంలోని యోగా సెంటర్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ వివాహ వేడుక అత్యంత గోప్యంగా, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది.
ఈ జంట తమ వివాహంపై అధికారిక ప్రకటనను ఈరోజు సాయంత్రం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసే అవకాశముందని సమాచారమిస్తోంది.
ఇప్పటికే కొన్ని నెలలుగా సమంత–రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారన్న ప్రచారం వినిపిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్–డీకే ద్వయం తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లలో సమంత కీలక పాత్రల్లో కనిపించారు. ఈ ప్రాజెక్టుల సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి, ఆత్మీయత ప్రేమగా మారిందన్న వార్తలు అప్పటినుంచే టాలీవుడ్ వర్గాల్లో వినిపించాయి.
ఇటీవల వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంబంధంపై జరుగుతున్న చర్చలకు మరింత బలం లభించింది.
కోయంబత్తూరులో జరిగిన వివాహ వేడుకలో సమంత సంప్రదాయబద్ధమైన ఎర్రచీరలో మెరిసిపోయినట్లు అక్కడినుంచి బయటకు వచ్చిన ఫొటోలు సూచిస్తున్నాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యక్తిగత జీవితం తరచూ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూనే ఉంది. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగినట్లు బయటకు వచ్చిన సమాచారంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.
ఇక ఈ జంట నుంచి వచ్చేఅధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



