శబరిమల భక్తులకు వరుస ప్రమాదాలు: కేరళ–కర్ణాటకలో విషాదం, నలుగురు మృతి

కేరళ శబరిమల పర్వత ప్రాంతం ప్రస్తుతం భక్తుల రద్దీతో నిండిపోయింది. అయ్యప్ప స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో చేరుకుంటున్నారు. డిసెంబరు 26న మండల పూజలు ముగియనున్న నేపథ్యంలో దర్శనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అనంతరం మకరవిళక్కు వేడుకల కోసం ఆలయం డిసెంబరు 30న మళ్లీ తెరుచుకోనుంది. ఈ నెల 16న మండల పూజల కోసం దేవాలయం తెరవబడిన తొలి వారం నుంచే లక్షలాది భక్తులు దర్శనం చేస్తున్నారు. మొదటి వారంలోనే భక్తుల సంఖ్య 10 లక్షలను దాటిందని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

అయితే భారీ రద్దీ మధ్య వరుస ప్రమాదాలు భక్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజా ఘటనలో, శబరిమల యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు కేరళలోని వండూర్ సమీప అంబలపాడి మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడినవారు బెంగళూరుకు చెందిన ప్రదీప్ కుమార్, ధర్మేష్, సంజయ్, ధృవరాజ్, నిఖిల్‌గా గుర్తించారు. వీరిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో కర్ణాటకలో చోటుచేసుకున్న మరో భయంకర రోడ్డు ప్రమాదం మరింత విషాదాన్ని రేకెత్తించింది. కర్ణాటక కోలార్‌ జిల్లా మాలూరు తాలూకా అబ్బేనహళ్లి సమీపంలో బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో చెన్నైకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు — గోపీ, గౌతమ్ రమేష్, హరిహరన్, జయంకర్ — అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నంబర్ టీఎన్ 14 టీ 4801 అని పోలీసులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే మాలూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో అతివేగం లేదా డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా ఉన్నట్టు భావిస్తున్నారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి కారు కింద పడిందని, ముందుగా ఫ్లైఓవర్ సైడ్ వాల్‌ను ఢీకొట్టి వేగంతో ముందుకు దూసుకెళ్లి కిందికి కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను సేకరించి పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి