రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్ | RBI కొత్త నిబంధనలు 2026

అప్పు తీసుకున్న వారిని వేధించే రికవరీ ఏజెంట్ల ధోరణికి ముగింపు పలకాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రుణ వసూలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, మర్యాదపూర్వకంగా నిర్వహించేలా ఫిబ్రవరి 12, 2026న సవరణ ఆదేశాలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులపై ప్రజల నుంచి మార్చి 6లోపు అభిప్రాయాలను ఆర్‌బీఐ కోరింది.

ఇకపై ఎవరిని పడితే వారిని రికవరీ ఏజెంట్లుగా నియమించేందుకు బ్యాంకులకు వీలుండదు. కొత్త నిబంధనల ప్రకారం, రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) నిర్వహించే డెట్ రికవరీ శిక్షణ పూర్తి చేసి ధృవీకరణ పత్రం పొందాలి. అలాగే, ఏజెంట్ల నియామకానికి ముందు వారి నేపథ్యాన్ని బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలించి (డ్యూ డిలిజెన్స్), అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

వేధింపులకు కఠిన చర్యలు: RBI
రుణ గ్రహీతల గోప్యతను గౌరవించడంపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి సారించింది. రికవరీ ఏజెంట్లు నిర్ణీత సమయాల్లో మాత్రమే బాకీదారులను సంప్రదించాలి. అకాల సమయాల్లో కాల్స్ చేయడం, అసభ్య పదజాలం వాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వసూలు ప్రక్రియలో అవసరమైన సమాచారం మాత్రమే ఏజెంట్లకు అందించాలి తప్ప, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని స్పష్టం చేసింది.

ఫిర్యాదు పెండింగ్‌లో ఉంటే రికవరీ నిలిపివేత తప్పనిసరి!
రుణ గ్రహీత బ్యాంకుపై లేదా రికవరీ ఏజెంట్ ప్రవర్తనపై ఫిర్యాదు చేసినట్లయితే, ఆ ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు సంబంధిత కేసును ఏజెంట్‌కు అప్పగించకూడదు. విచారణ జరుగుతున్న సమయంలో రికవరీ చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, బ్యాంకులు తమ ఉద్యోగులు మరియు రికవరీ ఏజెంట్ల కోసం ప్రత్యేక ‘ప్రవర్తనా నియమావళి’ (Code of Conduct) రూపొందించుకోవడం తప్పనిసరి.

TRAI నిబంధనలు కూడా అమలు
ఆర్‌బీఐ ఆదేశాలతో పాటు బ్యాంకులు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను కూడా పాటించాలి. వాణిజ్య సమాచార మార్పిడిలో టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ రెగ్యులేషన్స్–2018 నిబంధనలను ఉల్లంఘించకూడదు. ఈ సవరణలతో రుణ వసూలు ప్రక్రియలో ఉండే అనవసర ఒత్తిడి, వేధింపులు తగ్గి, రుణ గ్రహీతలకు చట్టపరమైన భరోసా మరింత బలపడనుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి