చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, తాజాగా దాన్ని రూ.20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశంలో ప్రకటించింది.
మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు ఈ కొత్త రూల్ వర్తించనుంది. కొత్తగా లోన్ తీసుకునేవారితో పాటు, ఇప్పటికే ఉన్న లోన్లను రీన్యువల్ చేసుకునేవారికీ రూ.20 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం ఉండదు. ఈ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) పథకం కింద ఈ లోన్లు మంజూరు చేయనున్నారు. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, యంత్రాల కొనుగోలు వంటి అవసరాల కోసం ఈ కొల్లాటరల్ ఫ్రీ బిజినెస్ లోన్లు ఉపయోగపడనున్నాయి. ఈ నిర్ణయంతో చిన్న వ్యాపారులు, స్టార్టప్స్‌కు రుణాలు మరింత సులభంగా లభించనున్నాయి.



