మన రక్తం శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేస్తూ జీవనాధారంగా ఉంటుంది. కానీ రక్తం అసాధారణంగా మందగించడం ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఇది సైలెంట్ కిల్లర్లాగా మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీయవచ్చు.
రక్తం మందగా మారటానికి అనేక కారణాలు ఉన్నాయి: డీహైడ్రేషన్, షుగర్, క్యాన్సర్, జన్యు లోపాలు, ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, వయసు (65 ఏళ్లు పైగా), గర్భధారణ, అధిక బరువు, హార్మోన్ ట్రీట్మెంట్, ధూమపానం, కొన్ని మందులు వంటివి. రక్తం మందగా మారితే గుండె సమస్యలు, స్ట్రోక్, రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ప్రారంభ దశల్లో దీని లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు, కాబట్టి జాగ్రత్త అవసరం.
కాబట్టి, రక్తాన్ని సహజంగా పలుచబరచడానికి కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు సహాయపడతాయి. ఇవి తీసుకునే ముందు ఎల్లప్పుడూ డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.
మిరియాలు
మిరియాలు రక్తాన్ని పలుచబరుస్తాయి. వీటిని సూప్, కూరల్లో కలపడం ద్వారా తీసుకోవచ్చు. మిరియాల్లోని సాలిసిలేట్స్ రక్తాన్ని చిక్కబడకుండా ఉంచుతాయి. దీనివల్ల రక్తసరఫరా మెరుగుపడుతుంది, రక్తపోటు కూడా కంట్రోల్ అవుతుంది. ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.
విటమిన్-ఇ
విటమిన్-ఇ రక్తాన్ని పలుచబరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బాదం, సన్ ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ నట్స్, పీనట్ బటర్, గ్రెయిన్స్ వంటి ఆహారాలు విటమిన్-ఇ అందిస్తాయి. సప్లిమెంట్స్ తీసుకునే ముందు డాక్టర్ సలహా తప్పనిసరి.
అల్లం
అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఇందులోని సాలిసిలేట్స్ రక్తాన్ని పలుచబరుస్తాయి. తాజా అల్లం, ఎండబెట్టిన అల్లం వంటల్లో కలపడం లేదా టీ, రసాలు, స్మూతీతో తీసుకోవచ్చు.
పసుపు
పసుపులోని కుర్కుమిన్ రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. వంటల్లో, కూరల్లో, సూప్ లేదా వేడి నీటిలో కలిపి తీసుకోవచ్చు. రక్తం పలుచబరచే మందులు తీసుకుంటున్నవారికి డాక్టర్ సలహా తప్పనిసరి. క్యాప్సూల్ రూపంలో కూడా సలహా మేరకు తీసుకోవచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లి యాంటీ థ్రాంబోటిక్ గుణాలతో రక్త గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. రక్తపోటును తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంది. వంటల్లో, బేకింగ్ లో కలిపి, లేదా ఇతర సప్లిమెంట్స్ రూపంలో డాక్టర్ సలహాతో తీసుకోవచ్చు.
ఈ ఫుడ్స్ నియమితంగా, డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే రక్తం పలుచబరచి, ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు.



