జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 18 మంది మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తున్న ఒక టెంపో ట్రావెలర్, రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వేగంగా ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్ ప్రాంతానికి చెందిన యాత్రికులు బికనీర్ జిల్లాలోని కొలాయత్ జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఫలోడి సబ్‌ డివిజన్‌లోని మటోడా ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో ట్రావెలర్ అతివేగంతో వెళ్తుండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన నిలిపిన ట్రక్కును ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తెల్లవారుజామున వెలుతురు తక్కువగా ఉండటమూ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందంటే, టెంపో ట్రావెలర్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మృతుల గుర్తింపుకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఫలోడి సమీపంలోని మటోడా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించాను. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను,” అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు వాహనాలపై మెకానికల్ పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి