ఆటో డ్రైవర్ నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన రాహుల్ తనేజా – కొడుకి కోసం రూ.31 లక్షల ఫ్యాన్సీ కారు నంబర్ కొనుగోలు

జీవితంలో కష్టపడి ఎదగాలనే తపన ఉంటే, ఒకప్పుడు ఆటో నడిపిన వ్యక్తి కూడా కోట్ల రూపాయల వ్యాపారవేత్తగా మారగలడు — దీనికి జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్త రాహుల్ తనేజానే నిదర్శనం. ఆయన తాజాగా తన కొడుకు కోసం రూ. 31 లక్షల ఫ్యాన్సీ కారు నంబర్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు రాజస్థాన్‌ అంతటా సంచలనంగా మారింది.

ఫ్యాన్సీ నంబర్‌కి 31 లక్షలు

జైపూర్ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం నిర్వహించిన వేలంలో రాహుల్ తనేజా పోటీపడి, తన కుమారుడి కొత్త ఆడి RSQ8 లగ్జరీ కారుకు “RJ 60 CM 0001” అనే ప్రత్యేక వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందారు. రూ.31 లక్షల బిడ్‌తో ఈ నంబర్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ఆయన రాజస్థాన్ చరిత్రలో అత్యంత ఖరీదైన కారు నంబర్ రికార్డు సృష్టించారు.

కుమారుడికి ప్రత్యేక బహుమతి

నవంబర్ 16న రాహుల్ తనేజా కుమారుడు రెహాన్ 18 ఏళ్ల వయస్సు పూర్తిచేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా తండ్రి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ఆయన కొడుక్కి ఆడి కారును ఈ ప్రత్యేక నంబర్‌తో బహూకరించారు. “ఏడేళ్ల క్రితం వాడికి మాటిచ్చాను. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నా,” అని రాహుల్ ఆనందంగా తెలిపారు.

కష్టాల నిండిన బాల్యం

రాహుల్ తనేజా జీవితం విజయాల కంటే ముందుగా కష్టాలతోనే నిండిపోయింది. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టారు. తండ్రి సైకిల్ పంక్చర్లు వేయడం, తల్లి పొలాల్లో పని చేయడం చేసేవారు. కుటుంబ ఆర్థిక స్థితి దుర్భలంగా ఉండడంతో, 11 ఏళ్ల వయసులోనే రాహుల్ జైపూర్‌లోని ఓ దాబాలో వెయిటర్‌గా పని ప్రారంభించారు. తరువాత పటాకులు, రంగులు, గాలిపటాలు అమ్మడం, కొరియర్ బాయ్‌గా పని చేయడం, వార్తాపత్రికలు పంపిణీ చేయడం, రాత్రిళ్లు ఆటో నడపడం వంటి అనేక చిన్న పనులు చేశారు.

వ్యాపారవేత్తగా ఎదుగుదల

కష్టపడి సొమ్ము కూడబెట్టిన రాహుల్, 19 ఏళ్ల వయసులోనే ‘కార్ ప్యాలెస్’ అనే చిన్న కారు డీలర్‌షిప్ ప్రారంభించారు. అదే సమయంలో ఆయన మోడలింగ్‌లో కూడా రాణించి ‘మిస్టర్ జైపూర్’ మరియు ‘మిస్టర్ రాజస్థాన్’ టైటిళ్లు గెలుచుకున్నారు. తరువాత ఈవెంట్ మేనేజ్‌మెంట్‌, లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్‌ వంటి వ్యాపారాల్లో అడుగుపెట్టి, కోట్ల రూపాయల సంపాదకుడిగా మారారు.

ఫ్యాన్సీ నంబర్లపై అభిమానం

రాహుల్‌కు ఫ్యాన్సీ నంబర్లంటే పిచ్చి ప్రేమ. 2011లో తన BMW కారుకు రూ.10 లక్షలు, 2018లో జాగ్వార్ కారుకు రూ.16 లక్షలు వెచ్చించి వీఐపీ నంబర్లను కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో రూ.31 లక్షలు ఖర్చు చేశారు.

రాహుల్ స్పందన

“నేను ఎప్పుడూ వర్తమానంలో జీవిస్తాను. నాకు సంతోషాన్నిచ్చేది చేస్తాను. నా సంతోషం నా కొడుకు సంతోషంలోనే ఉంది. వాడికి కార్లు, నంబర్లు అంటే ఇష్టం. వాడి ఆనందం కోసం ఖర్చు పెట్టడంలో నాకు ఎలాంటి సందేహం లేదు,” అని ఆయన నవ్వుతూ చెప్పారు.

రాహుల్ తనేజా కథ కేవలం ఆర్థిక విజయం గురించేగాదు — అది కష్టపడి, పట్టుదలతో జీవితాన్ని మార్చుకునే ఒక సాధారణ మనిషి అసాధారణ గాథగా నిలిచిపోయింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి