పూణే–బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: రెండు కంటైనర్ లారీలు ఢీకొని ఎనిమిది మంది సజీవదహనం

పూణే–బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నవలే వంతెన సమీపంలో జరిగిన ఈ భయానక ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రెండు కంటైనర్ లారీలు ఒకదానికొకటి ఢీకొన్న క్షణాల్లోనే మంటలు చెలరేగి, చుట్టుపక్కల వారిని భయంతో ఉలిక్కిపడేలా చేశాయి.

ప్రమాదం సమయంలో కంటైనర్ల మధ్యలో ఒక కారు చిక్కుకోవడంతో, అందులో ప్రయాణిస్తున్న వారంతా బయటపడే అవకాశం లేక సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను తక్షణం సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి మహా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ప్రమాదానికి కారణం గురించి పోలీసులు ప్రాథమికంగా బ్రేక్ ఫెయిల్ మరియు అతివేగం అని నిర్ధారించారు. సతారా నుండి ముంబై వైపు వెళ్తున్న కంటైనర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి, ముందుగా పలు వాహనాలను ఢీకొట్టిందని, చివరికి మరో కంటైనర్ లారీతో బలంగా ఢీకొన్నట్లు వివరించారు. ఆ రెండు ట్రక్కుల మధ్య చిక్కుకున్న కారు పూర్తిగా కాలిపోయి నాశనం అయిందని తెలిపారు.

ప్రమాదంలో అగ్నికి ఆహుతైనవారి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలం నుంచి వాహనాలను తొలగించి రహదారిపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో ప్రాంతం అంతా విషాద వాతావరణంలో మునిగిపోయింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి