మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. కణాల మరమ్మత్తు, కొత్త కణాల నిర్మాణం, ఎంజైమ్‌లు–హార్మోన్ల తయారీ, రోగనిరోధక శక్తి పెంపకం, జుట్టు–చర్మ ఆరోగ్యం వంటి అనేక అవసరాలకు ప్రోటీన్ తప్పనిసరి. అయితే వయసు, బరువు, శారీరక శ్రమను బట్టి ప్రతి వ్యక్తికి అవసరమయ్యే ప్రోటీన్ పరిమాణం భిన్నంగా ఉంటుంది.
సాధారణంగా చికెన్ బ్రెస్ట్, గుడ్లు, చేపలు వంటి జంతు ఆధారిత ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి అందరికీ సరిపోవు. కొందరికి జీర్ణ సమస్యలు రావడం, మరికొందరు వీటిని తీసుకోలేకపోవడం లేదా ఎక్కువగా తీసుకుంటే పేగుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశమూ ఉంటుంది. అందుకే జీర్ణవ్యవస్థకు హాని కలగకుండా, పేగుల ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్ రిచ్ ఆహారాలను ఎంచుకోవడం చాలా అవసరం. ఇవి ప్రోటీన్‌తో పాటు ఇతర కీలక పోషకాలను కూడా అందిస్తాయి.
ఇప్పుడు పేగుల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మేలు చేసే ముఖ్యమైన ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాల గురించి తెలుసుకుందాం.
పనీర్, టోఫు
అధిక ప్రోటీన్‌తో పాటు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాల్లో పనీర్ ముఖ్యమైనది. పనీర్‌లో ఉన్న ప్రోటీన్ శరీరానికి సులభంగా జీర్ణమవుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందడమే కాకుండా జీర్ణ ఆరోగ్యానికి మద్దతు లభిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్ డైట్స్ అనుసరించే వారికి పనీర్ మంచి ఎంపిక.
అదే విధంగా సోయాబీన్స్ పాలతో తయారు చేసే టోఫు కూడా అత్యుత్తమ ప్రోటీన్ మూలం. టోఫులో శరీర పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. 100 గ్రాముల టోఫులో సుమారు 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. టోఫును తీసుకోవడం వల్ల ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు కూడా అందుతాయి. పేగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడకుండా జీర్ణక్రియకు ఇది సహకరిస్తుంది.
టెంపే
టెంపే కూడా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం. దీనిని పులియబెట్టిన సోయాబీన్స్‌తో తయారు చేస్తారు. పులియబెట్టిన ఆహారం కావడం వల్ల ఇందులో సహజంగా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
100 గ్రాముల టెంపేలో సుమారు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పనీర్‌తో పోలిస్తే టెంపే ద్వారా ఎక్కువ ప్రోటీన్ పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మొలకెత్తిన పెసలు
మొలకెత్తిన పెసలు కూడా మంచి ప్రోటీన్ మూలం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు నిండిన భావన కలిగి ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు నియంత్రణలో సహాయపడతాయి.
పెసలను నానబెట్టి లేదా మొలకెత్తించడం వల్ల అందులో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. దీని వల్ల ఐరన్, జింక్, క్యాల్షియం వంటి ఖనిజాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో డయాబెటిస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. అయితే అధికంగా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక రోజుకు అర కప్పు పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది.
పెరుగు
పెరుగులో కూడా ప్రోటీన్ మంచి మోతాదులో ఉంటుంది. 100 గ్రాముల పెరుగులో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, ఆకలి త్వరగా వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. అంతేకాదు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పెరుగు సహాయపడుతుంది.
ఈ విధమైన ప్రోటీన్ రిచ్ ఆహారాలను నిత్యాహారంలో భాగం చేసుకుంటే పేగుల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా శరీరానికి కావలసిన ప్రోటీన్‌తో పాటు ఇతర అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి ఎంతో ఉపయుక్తమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.



