యువరాజు అరెస్ట్ వెనుక అసలు కారణం ఇదే – ఎప్‌స్టీన్‌తో లింక్!

బ్రిటన్ రాజకుటుంబంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. దివంగత రాణి ఎలిజబెత్ II రెండో కుమారుడు, ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ III సోదరుడు అయిన మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూను బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్తో ఉన్న సంబంధాల నేపథ్యంలో, అధికార దుర్వినియోగం ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఫైల్స్‌లో, ఆండ్రూ 2010లో బ్రిటన్ వాణిజ్య రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో, ఎప్‌స్టీన్‌కు అత్యంత రహస్యమైన ప్రభుత్వ వాణిజ్య నివేదికలు, సున్నితమైన పత్రాలు పంపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగాల ఆధారంగా బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

విశేషమేమిటంటే, ఆండ్రూ 66వ పుట్టినరోజు రోజునే ఈ అరెస్ట్ జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్లో ఉన్న తన నివాసంలోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

థేమ్స్ వ్యాలీ పోలీస్ విభాగం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నార్ఫోక్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, జాతీయ మార్గదర్శకాల ప్రకారం పేరు వెల్లడించడం లేదని తెలిపింది. అయితే అరెస్ట్ అయింది ఆండ్రూనేనని బీబీసీ, ది గార్డియన్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు ధృవీకరించాయి.

గతంలో ఎప్‌స్టీన్‌తో తన స్నేహం ఒక పొరపాటని అంగీకరించిన ఆండ్రూ, తాను ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనలేదని ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నారు. బ్రిటన్‌లో ‘పబ్లిక్ ఆఫీస్‌లో మిస్‌కండక్ట్’ అనే నేరం అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కేసులో నేరం రుజువైతే జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆండ్రూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ ఘటనపై రాజకుటుంబం గానీ, ఆయన ప్రతినిధులు గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ తాజా పరిణామం బ్రిటన్ రాజకుటుంబ ప్రతిష్ఠను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి