ఉత్తరప్రదేశ్‌లో భయానక ఘటన: పురిటి నొప్పులతో గర్భిణీ మహిళ కడుపు కోసుకుని ప్రసవం

ప్రతి మహిళ ప్రసవ సమయంలో పునర్జన్మ పొందినట్టేనని అంటారు. కారణం – ప్రసవ వేదనతో పాటు ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితుల్లో ఆమె ప్రాణాలకే ముప్పు ఉండొచ్చు. అయితే ఆధునిక కాలంలో ఆస్పత్రులు, మెరుగైన వైద్యసేవల వల్ల ప్రసవాలు ఎక్కువగా సురక్షితంగా, సమస్యలేకుండా జరుగుతున్నాయి. అయినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన అందరినీ కలిచివేసింది. ఆస్పత్రికి చేరుకునేలోపే తీవ్ర పురిటి నొప్పులను భరించలేక ఓ గర్భిణీ మహిళ వంటింట్లో దొరికిన కత్తితో తన కడుపును కోసుకుంది. ఆ భయానక పరిస్థితిలోనూ ఆమె ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం ఆశ్చర్యం కలిగించింది.

ఒంటరితనం.. భరించలేని నొప్పులు

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా పరిధిలోని బౌండి పోలీస్ స్టేషన్ కింద ఉన్న నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల నంకై నిండు నెలల గర్భిణీ. ఆరు నెలల క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పురిటి నొప్పులు మొదలవ్వడంతో, ఇంట్లో ఎవరూ లేకపోవడం, నొప్పుల తీవ్రత క్రమంగా పెరగడంతో ఆమె తీవ్ర ఆందోళనకు లోనైంది. ఆ బాధను తట్టుకోలేక వంటింట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో తన పొత్తికడుపును కోసుకుంది.

ప్రమాదకర స్థితిలో ఆస్పత్రికి…

తీవ్ర గాయాల కారణంగా ఆమె విపరీతంగా కేకలు వేయడంతో శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం ఆమెను ఫఖర్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కత్తితో కోసుకోవడం వల్ల పేగులు బయటకు రావడం, భారీగా రక్తస్రావం జరగడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.

మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలింపు..

పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ముందుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆమె గాయాలను పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “మధ్యాహ్నం 3.20 గంటలకు ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఆమె పరిస్థితి అత్యంత సీరియస్‌గా ఉంది. కడుపుపై లోతైన గాయం ఉండటంతో భారీగా రక్తం కోల్పోయింది” అని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను లక్నోలోని ఉన్నత స్థాయి వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నంకై తల్లి నీతా ఆమె వెంట ఉండి చికిత్స అందేలా పర్యవేక్షిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి