ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని వణికిస్తోంది. విద్య నుంచి వైద్యం వరకు… కార్యాలయాలు నుంచి సాధారణ జీవితానికి వరకు… ఏ రంగం చూసినా ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనుషుల ఊహలకు రూపమిచ్చే శక్తిగా ఏఐ మారిపోయింది. తాము చూడాలని కోరుకున్న దృశ్యాలు నిజజీవితంలో సాధ్యం కాకపోతే… ఏఐ టెక్నాలజీతో వాటిని నెరవేర్చుకుంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా సినీ అభిమానులు ఈ టెక్నాలజీని విపరీతంగా వాడుతున్నారు. తమ అభిమాన నటీనటులను ఎలా చూడాలనుకుంటున్నారో… ఆ రూపంలో ఏఐ ఫోటోలు, వీడియోలను తయారు చేస్తున్నారు.
ఇటీవల ఈ క్రేజ్ మరింత పెరిగింది. కొంతకాలం క్రితం ఏఐతో ప్రభాస్ పెళ్లి జరిగితే ఎలా ఉంటుందనే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్‌కు పిల్లలు పుడితే ఎలా ఉంటారో కూడా చూపించిన ఏఐ చిత్రాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇదే ట్రెండ్‌లో మరో వీడియో సంచలనం సృష్టిస్తోంది. వెండితెరపై సూపర్‌హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్–అనుష్కలకు ఏఐ టెక్నాలజీతో పెళ్లి జరిపించిన వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
ఈ వీడియోలో ప్రత్యేకంగా కనిపించేది—పెళ్లి పనులన్నీ టాలీవుడ్ స్టార్ హీరోలే చేస్తున్నట్టుగా చూపించడం. ప్రభాస్–అనుష్కల పెళ్లికి నాగార్జున, నాని సన్నాయి వాయిస్తుండగా… అల్లు అర్జున్, రవితేజ రంగస్థలం తెగలా స్టెప్పులు వేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేస్తున్నట్టుగా… గోపిచంద్ వడ్డిస్తున్నట్టుగా వీడియోలో చూపించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేసుకుంటుండగా… కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తున్న సన్నివేశాలు ఉన్నాయి. మరో వైపు మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరైనట్టు ఏఐ వీడియోలో చూపించారు.
“ప్రభాస్–అనుష్కల పెళ్లి… అందరూ ఆహ్వానితులే” అని ఓ నెటిజన్ తయారు చేసిన ఈ ఏఐ వీడియో ఇప్పుడు నెట్‌లో సూపర్ వైరల్. ఇది నిజం అయితే ఎంత బాగుండేదో అని ప్రభాస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.



