పోలీసుల ప్రెస్నోట్లు, ఎఫ్ఐఆర్లు లేదా పోలీసులకు అందిన ఫిర్యాదులను గమనిస్తే, అందులో బాధితులు మాత్రమే కాకుండా ఆరోపితుల కులం పేరు కూడా చాలాసార్లు కనిపిస్తుంది. కుల వివక్షకు సంబంధించిన కేసులు లేదా కులాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న సందర్భాల్లో ఇది సహజమే అనిపించవచ్చు. కానీ సాధారణ నేరాలకు సంబంధించిన కేసుల్లో కూడా కులం తప్పనిసరిగా ఎందుకు నమోదు చేస్తున్నారు? దీనికి చారిత్రకంగా, పరిపాలనా విధానాల పరంగా కొన్ని కారణాలు ఉన్నాయి.
కులం రికార్డు చేసే పద్ధతి ఎలా మొదలైంది?
భారత్‌లో ఆధునిక పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ పాలనలోనే రూపుదిద్దుకుంది. అప్పటి నుంచే పోలీస్ రికార్డుల్లో కులం నమోదు చేసే పద్ధతి ప్రారంభమైందని పరిశోధకులు చెబుతున్నారు.
1871లో బ్రిటిష్ ప్రభుత్వం ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా కొన్ని కులాలు, తెగలను సమూహంగా “నేరప్రవృత్తి గలవారు”గా ముద్ర వేసింది. ఆ క్రమంలో ఆయా కులాలకు చెందిన వ్యక్తుల వివరాలను పోలీస్ స్టేషన్లు కులం పేరుతో సహా నమోదు చేసి, వారిపై నిఘా పెట్టాల్సి వచ్చేది.
తరువాత రూపొందిన పోలీస్ మాన్యువల్స్‌లో కూడా ఈ విధానం కొనసాగింది. 1952లో క్రిమినల్ ట్రైబ్స్ చట్టం రద్దయినా, ఆ చట్టపు ఛాయలు మాత్రం పోలీసింగ్ వ్యవస్థలో మిగిలిపోయాయి. అందుకే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఫిర్యాదు ఇచ్చేటప్పుడు తండ్రి పేరు, వృత్తితో పాటు కులం పేరు కూడా అడుగుతున్నారు.
ఇప్పటికీ కులం రికార్డులు ఎందుకు కొనసాగుతున్నాయి?
బ్రిటిష్ కాలంలో మొదలైన ఈ అలవాటు ఇప్పటికీ కొనసాగడానికి పలు కారణాలు చెబుతున్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం, బాధితులు లేదా నిందితుల సామాజిక–ఆర్థిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా కుల వివరాలు ఉపయోగపడతాయన్న అభిప్రాయం ఉంది. దేశవ్యాప్తంగా నేరస్తుల సమాచారాన్ని భద్రపరిచే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS)లో కూడా కులం కోసం ప్రత్యేక కాలమ్ ఉంది.
అయితే, నేరానికి కులమే కీలక అంశం కానప్పుడు చట్టపరంగా కులం నమోదు చేయాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం–1955, ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం–1989 కింద నమోదయ్యే కేసుల్లో మాత్రమే కులం పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి.
సాధారణంగా పోలీస్ శాఖ వ్యక్తులను గుర్తించడానికి కులాన్ని ఒక గుర్తింపు అంశంగా ఉపయోగిస్తున్నారే తప్ప, దర్యాప్తులో దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న వాదన కూడా ఉంది. మరోవైపు, జైళ్లలో ఉన్నవారిలో ఎక్కువ శాతం వెనుకబడిన లేదా అణగారిన వర్గాలకు చెందినవారే ఉండటం వంటి సామాజిక విశ్లేషణలకు ఈ డేటా ఉపయోగపడుతుందని కొందరు భావిస్తున్నారు.
కులం పేరు వద్దంటున్న కోర్టులు
కులం నమోదు చేసే విధానంపై కోర్టులు క్రమంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
2025 మార్చిలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ దివాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఐఆర్లు, అరెస్ట్ మెమోలు వంటి పోలీస్ పత్రాల్లో కులం ఎందుకు రాస్తున్నారని ప్రశ్నిస్తూ, దీనిపై వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ డీజీపీని ఆదేశించారు.
‘‘రాజ్యాంగం కుల వివక్షను తొలగించాలని హామీ ఇస్తోంది. ఇలాంటి నమోదు ప్రజలపై ముద్ర పడేలా చేస్తుంది, వ్యవస్థీకృత వివక్షకు దారితీస్తుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రవీణ్ ఛెత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో ఈ అంశం తీవ్ర చర్చకు వచ్చింది. ఒకే తరహా పేర్లున్న వ్యక్తుల మధ్య తేడా గుర్తించడానికి, CCTNS అవసరాల కోసమే కులం రాస్తున్నామని డీజీపీ వివరణ ఇచ్చారు. అయితే, 21వ శతాబ్దిలో వ్యక్తులను గుర్తించడానికి వేలిముద్రలు, ఆధార్, బాడీ కెమెరాలు, మొబైల్ ట్రాకింగ్ వంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయని కోర్టు ఈ వాదనను తిరస్కరించింది.
అంతేకాదు, ఎఫ్ఐఆర్, రికవరీ మెమో, అరెస్ట్ ఫారం, ఇతర పోలీస్ పత్రాల్లో కులం కాలమ్ తొలగించాలని, వ్యక్తి గుర్తింపుకు తండ్రి లేదా తల్లి పేరును ఉపయోగించవచ్చని కోర్టు సూచించింది. 2025 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకు కులం నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.
కోర్టు పత్రాల్లో కూడా కులం వద్దు
పోలీసు రికార్డులే కాదు, కోర్టుల కాజ్ టైటిల్స్‌లో కూడా కులం పేరు ఉండకూడదని 2023లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరోపితునితో న్యాయస్థానం వ్యవహరించేటప్పుడు అతనికి కులం, మతం ఉండవని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదే తరహాలో 2020లో రాజస్థాన్ హైకోర్టు, 2016లో పంజాబ్–హర్యానా హైకోర్టు కూడా అరెస్ట్ మెమోల్లో కులం నమోదు చేయవద్దని ఆదేశాలు ఇచ్చాయి. రాజ్యాంగంలో కానీ, సీఆర్పీసీలో కానీ కులం రాయాలనే నిబంధన లేదని కోర్టులు స్పష్టం చేశాయి.
భిన్న అభిప్రాయాలు
కులం పేరు తొలగింపుపై సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దళితులు, గిరిజనులకు చట్టపరమైన రక్షణలు ఉన్నందున, ఆ కేసుల్లో సామాజిక నేపథ్యం నమోదు చేయడం అవసరమని ఒక వర్గం అంటోంది. అదే సమయంలో, ఫిర్యాదుదారు లేదా బాధితుడు తన కులం పేరు ఇవ్వడం ఇష్టం లేకపోతే పోలీసులు బలవంతం చేయకూడదని న్యాయవాదులు చెబుతున్నారు.
కుల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ మాట్లాడుతూ, ‘‘సమాజంలో కుల ప్రభావం ఉన్నప్పుడు, నేరం జరిగినప్పుడు మాత్రమే కులం రాయకూడదనడం సరైన పరిష్కారం కాదు. అయితే, ప్రెస్నోట్లలో మాత్రం కులం రాయాల్సిన అవసరం లేదు. ఎవరైనా తమ కులం పేరు నమోదు చేయడం ఇష్టం లేదంటే, అది వారి హక్కు’’ అని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, పోలీస్ రికార్డుల్లో కులం నమోదు చేయడం ఒక చారిత్రక వారసత్వంగా కొనసాగుతున్నప్పటికీ, ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అవసరమా కాదా అన్న చర్చ మరింత బలపడుతోంది.



