ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో ఒక సంచలన ఘటన వెలుగుచూసింది. దిల్లీ నుంచి వచ్చిన ఓ కుటుంబం, శవం బదులుగా ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించిన విషయం బయటపడింది. పవిత్రంగా భావించే బ్రిజ్ ఘాట్–ఘర్ ముక్తేశ్వర్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.
దిల్లీకి చెందిన ఒక ఫ్యామిలీ, హాపూర్‌లోని బ్రిజ్ ఘాట్‌కు అంత్యక్రియల పేరుతో వచ్చింది. సాధారణంగా ఈ ప్రాంతంలో ప్రతిరోజూ అనేక శవాలకు తుదక్రియలు నిర్వహిస్తారు. ఇదే భావనతో అక్కడి ప్రజా సిబ్బంది, పూజారులు కూడా సిద్ధమయ్యారు. చితి పేర్చి, దానిపై వస్త్రంతో కప్పిన ఒక ‘శరీరం’ను ఉంచడంతో ఎవరూ అనుమానం వ్యక్తం చేయలేదు.
కానీ పూజారి ఆ వస్త్రాన్ని తొలగించగానే అసలు నిజం బయటపడింది. అది మనిషి శవం కాదు… పూర్తిగా ప్లాస్టిక్‌తో చేసిన బొమ్మ. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఘాట్ పవిత్రతను అవమానించే చర్యగా ఆ ఫ్యామిలీ ప్రవర్తనను ఖండించారు. వెంటనే అంత్యక్రియల కార్యక్రమాన్ని నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ అలజడిలో ఆ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వారిలో ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసుల చేతికి అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన వెనుక ఉద్దేశాన్ని కనుగొనేందుకు విస్తృత దర్యాప్తు చేపట్టారు.
ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు ఎందుకు చేయాలనుకున్నారు? ఇన్సూరెన్స్ మోసం కోసంనా? లేక మరేదైనా నేరానికి సంబంధించిన ఆనవాళ్లను దాచడానికి ప్రయత్నించారా? అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. ఒకవేళ ఏదైనా హత్య జరిగి, అసలు శవాన్ని ఇతరచోట మాయం చేశారనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం అరెస్టైన ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తూ, ఘటన వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.



