పెసరపప్పు సూప్ ఆరోగ్య ప్రయోజనాలు | బరువు తగ్గేందుకు బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ

ఆరోగ్యకరమైన ఆహారం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది తేలికగా జీర్ణమయ్యే, పోషకాలతో నిండిన వంటకాలు. అలాంటి వాటిలో పెసరపప్పు సూప్ ఒకటి. ఇది జీర్ణవ్యవస్థపై భారం పడకుండా శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని భావించే వారికి, డైట్‌లో భాగంగా తీసుకునే ఉత్తమమైన ఆహారంగా పెసరపప్పు సూప్‌ను చెప్పొచ్చు. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషక విలువలు ఉండటం దీని ప్రత్యేకత. మరి ఈ ఆరోగ్యకరమైన పెసరపప్పు సూప్‌ను ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

పెసరపప్పు సూప్‌కు కావాల్సిన పదార్థాలు

పెసరపప్పు – అర కప్పు
ఉల్లిపాయ – ఒకటి (చిన్నది)
తోటకూర – కొద్దిగా
టమాటో – ఒకటి (చిన్నది)
శనగపిండి – ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 2
జీలకర్ర – అర టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం గంటపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, తోటకూర, టమాటో, వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పై ఒక గిన్నె పెట్టి, అందులో కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. వెంటనే తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి వేసి కాస్త వేయించి, టమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గించాలి.

ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును కొద్దిగా నీటితో కలిపి గిన్నెలో వేయాలి. అవసరమైనంత నీరు పోసి, ఉప్పు కలిపి మరిగించాలి. పప్పు బాగా మెత్తబడిన తర్వాత, శనగపిండిని నీటిలో కలిపి సన్నగా పోస్తూ సూప్‌లో కలపాలి. సూప్‌కు సాంబార్ లాంటి గాఢత వచ్చే వరకు మెల్లగా మరిగించాలి. చివర్లో తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు.

ఇలా తయారైన పెసరపప్పు సూప్ రుచికరంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి ఆహారంగా తీసుకుంటే బరువు నియంత్రణతో పాటు శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి