ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్… శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి భక్తులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. శివరాత్రి ఉత్సవాలకు ముందే రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ… కోటప్పకొండ–కొత్తపాలెం గ్రామాల మధ్య నిర్మించిన నూతన రోడ్డును గురువారం ఆయన ప్రజలకు అంకితం చేశారు.

రూ.3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించారు. కోటప్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై కొంత దూరం నడిచి నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, కోటప్పకొండకు వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. శివరాత్రి నాటికి రహదారి పూర్తి చేయాలని కోరగా, దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నిర్ణీత సమయంలోనే నెరవేర్చారు.

ఈ నూతన రహదారి ప్రారంభంతో మహాశివరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే సుమారు లక్షన్నర మంది భక్తులకు ప్రయాణ సౌకర్యం గణనీయంగా మెరుగుపడనుంది. అంతేకాకుండా, కొత్తపాలెం పరిసర ప్రాంతాల రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుండగా, గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఈ రోడ్డు ఎంతో ఉపయుక్తంగా మారనుంది.

రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి జెడ్పీ పాఠశాల విద్యార్థులు పవన్ కల్యాణ్‌ను కలిసి, తమ గ్రామానికి రహదారి నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పాఠశాలకు క్రీడా మైదానం సహా అదనపు సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.

ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కోటప్పకొండలో ప్రతిపాదిత గిరిప్రదక్షణ మార్గం నమూనా లేఅవుట్‌ను, అలాగే జింకల పార్కును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జనసేన నరసరావుపేట ఇన్‌ఛార్జ్ సయ్యద్ జిలాని, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి