వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే కారణంతో చేర్చుకోకుండా తిరస్కరించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన మానవత్వాన్ని మర్చిపోయినట్టుగా చూపిస్తూ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి. రవి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అతడికి తోడుగా ఎవరూ లేకపోవడం, ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. వైద్యం అందకపోవడంతో రోగి ఆసుపత్రి ఆవరణలోనే రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నీరసించి కదలికలు లేకుండా పోయాడు.
రోగి మృతి చెందినట్టుగా భావించిన సిబ్బంది అతడిని మార్చూరీకి తరలించి భద్రపరిచారు. అయితే మరుసటి రోజు మార్చూరీ శుభ్రపరిచే పనిలో ఉన్న స్వీపర్లు ఆ వ్యక్తిలో ఇంకా కదలికలు ఉన్నట్టు గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, వైద్యులు అక్కడికి చేరుకొని రవికి తిరిగి చికిత్స అందించారు.
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, నిర్దాక్షిణ్యమైన ప్రవర్తనపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. “వైద్యం కోసం ఆశ్రయించిన రోగిని చేర్చుకోకుండా మానవత్వాన్ని తాకట్టుపెట్టారంటూ” స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి అయితే సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం దొరుకుతుందో అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



