రోడ్డుపై తోపుడుబండి తోసుకుంటూ పకోడీలు అమ్మిన ఓ సాధారణ తండ్రి… తన కష్టాన్ని, త్యాగాన్ని ఆయుధంగా మార్చుకుని నలుగురు పిల్లలను చదివించి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. వారిలో ఒకరు ఐఏఎస్ అధికారి కాగా, మిగతా ముగ్గురు వైద్యులు. ఇది కేవలం పిల్లల విజయం మాత్రమే కాదు… వారిని ఈ స్థాయికి తీసుకెళ్లిన ఆ తండ్రి గెలుపు కూడా. ఈ అరుదైన విజయకథలోకి ఒకసారి తొంగి చూద్దాం.
పేదరికాన్ని జయించిన కలలు
“పేదరికం మనుషులకే, కలలకు కాదు” అని నిరూపించింది రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన గోవింద్ కుమార్ కుమార్తె దీపేష్ కుమారి. చిన్నతనం నుంచే కుటుంబ కష్టాలను చూస్తూ పెరిగిన ఆమె, జీవితంలో చిన్న లక్ష్యాలతో ఆగిపోకూడదని నిర్ణయించుకుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పట్టుదలతో చదువుకుని చివరికి తన పేరుతో పాటు ఐఏఎస్ అని రాసుకుంది.
చిన్న గదిలో పెద్ద కలలు
భరత్‌పూర్ పట్టణంలోని అటల్‌బంద్ ఏరియాలో గోవింద్ కుమార్ కుటుంబం ఒక చిన్న గదిలో నివసించేది. రోజూ తోపుడుబండిపై పకోడీలు అమ్ముతూ తక్కువ ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేవాడు. అయినా పిల్లల చదువుపై ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. ఆ తండ్రి త్యాగం కారణంగానే ఈరోజు ఆయన పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగారు.
చదువులో అగ్రగామి
దీపేష్ కుమారి భరత్‌పూర్‌లోని శిశు ఆదర్శ్ విద్యామందిర్ పాఠశాలలో చదివి పదో తరగతిలో 98% మార్కులు, ఇంటర్మీడియట్‌లో 89% మార్కులు సాధించారు. ఆ తర్వాత జోధ్‌పూర్‌లోని ఎంబిఎం ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తరువాత ఐఐటి ముంబైలో ఎంఎస్‌టి చదివి, ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం కూడా సంపాదించారు. కానీ ఆమె లక్ష్యం అంత చిన్నది కాదు. ప్రజలకు సేవ చేయాలనే ఆత్మీయ కోరికతో ఆ ఉద్యోగాన్ని వదిలి సివిల్ సర్వీసెస్ వైపు దృష్టి సారించారు.
రెండో ప్రయత్నంలో విజయం
2020లో మొదటి సారి యూపీఎస్సీ పరీక్ష రాసినా విఫలమయ్యారు. కానీ ఆ విఫలమే ఆమెకు ప్రేరణగా మారింది. రెండోసారి డిల్లీలో కోచింగ్ తీసుకుని కష్టపడి చదివి 2021 సివిల్ సర్వీసెస్ పరీక్షలో అద్భుత విజయం సాధించారు. ఆల్ ఇండియా 93వ ర్యాంక్, అలాగే EWS కేటగిరీలో 4వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ రోడ్డు రవాణా, హైవేస్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ‘పీపుల్స్ ఐఏఎస్’గా పేరు తెచ్చుకున్నారు.
తోబుట్టువుల విజయాలు
దీపేష్ కుమారి మాత్రమే కాదు, ఆమె తోబుట్టువులూ కూడా తండ్రి కష్టాన్ని చూసి విజయ పథంలో నడిచారు.
- ఒక సోదరి ఢిల్లీ సఫ్దర్‌గంజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
- ఒక సోదరుడు గౌహతి AIIMSలో ఎంబీబీఎస్ చేస్తున్నారు.
- ఇంకో సోదరుడు లాతూర్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
తండ్రి నిజమైన విజేత
ఇలా నాలుగురిని చదివించి, ఒకరిని ఐఏఎస్ అధికారి, మిగతా ముగ్గురిని వైద్యులుగా తయారు చేసిన గోవింద్ కుమార్ జీవితం త్యాగానికి ప్రతీక. ఆయన కష్టం, పట్టుదల, పిల్లలపై నమ్మకం ఇవన్నీ కలిసివచ్చి నేడు సమాజానికి స్ఫూర్తిదాయకమైన విజయగాధను రాశాయి.
👉 ఈ కథ ఒక్క కుటుంబ విజయమే కాదు… పేదరికం ఎప్పుడూ అడ్డంకి కాదని నిరూపించే ప్రేరణాత్మక గాథ.



