అమెరికా ఆకాశం గత కొన్ని రోజులుగా అద్భుతమైన ప్రకృతి దృశ్యానికి వేదికగా మారింది. దేశంలోని దాదాపు 21 నుండి 25 రాష్ట్రాల వరకు “నార్తరన్ లైట్స్” (Northern Lights) వెలుగులు చీకటిని చెరిపేస్తూ కనువిందు చేస్తున్నాయి. దీపావళి కాంతుల్లా మెరుస్తున్న ఈ ఆకాశ వీక్షణం నవంబర్ 17 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తెలిపిన వివరాల ప్రకారం, అమెరికా చరిత్రలో ఇంత విస్తృతంగా నార్తరన్ లైట్స్ కనబడటం చాలా అరుదైన విషయం. నవంబర్ 11వ తేదీ రాత్రి నుండి ఈ ప్రకృతి మాంత్రికం ప్రారంభమై, దాదాపు 25 రాష్ట్రాలను తన కాంతులతో ముంచెత్తింది. వాటిలో 21 రాష్ట్రాల్లో ఆకాశం స్పష్టంగా మెరుస్తుండగా, మిగతా నాలుగు రాష్ట్రాల్లో మేఘావృతం కారణంగా కాంతులు కొంత అస్పష్టంగా కనిపించాయి.
ఈ నార్తరన్ లైట్స్ ప్రధానంగా అలస్కా నుండి ఇండియానా వరకు విస్తరించాయి. రెండు భారీ సౌర ఉద్గారాలు (Coronal Mass Ejections – CMEs) భూమి వైపు దూసుకురావడంతో భూ అయస్కాంత తుఫాను (Geomagnetic Storm) పరిస్థితులు ఏర్పడుతున్నాయని NOAA పేర్కొంది. ఈ తుఫాను తీవ్రత G3 స్థాయికి చేరుకునే అవకాశముందని తెలిపింది.
నార్తరన్ లైట్స్ కనబడిన రాష్ట్రాలు:
అలస్కా, నార్త్ డకోటా, మిన్నెసోటా, మోంటానా, విస్కాన్సిన్, మిచిగాన్, మైన్, సౌత్ డకోటా, ఇడహో, వెర్మోంట్, వాషింగ్టన్, న్యూ హాంప్‌షైర్, వ్యోమింగ్, న్యూయార్క్, అయోవా, మసాచుసెట్స్, పెన్సిల్వేనియా, నెబ్రాస్కా, ఒహియో, ఇల్లినాయిస్, ఇండియానా రాష్ట్రాలు ఈ ప్రకృతి అద్భుతాన్ని సాక్షాత్కరించాయి.
సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆకాశం పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో కళాత్మకంగా మెరిసింది. ఈ కాంతుల తీవ్రత మొదట G1 నుండి మధ్యస్థాయి G2 స్థాయికి చేరి, రాత్రి 10 గంటల నుండి వేకువజామున 1 గంట మధ్య అతి తీవ్ర స్థాయి అయిన G3 వరకు పెరిగింది.
NOAA అంచనా ప్రకారం, ఈ నార్తరన్ లైట్స్ నవంబర్ 13 మరియు 14 తేదీల వరకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఆ తరువాత క్రమంగా వీటి కాంతి ప్రభావం తగ్గిపోతుందని తెలిపింది. అయితే నవంబర్ 12వ తేదీ రాత్రి వీటి ప్రకాశం గరిష్ఠస్థాయిలో ఉండే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
ప్రకృతి అందాలను ప్రేమించే వారికి, ఆకాశాన్ని వీక్షించడం ఇష్టపడే వారికి – అమెరికా ప్రస్తుతం ఒక అద్భుతమైన ప్రకృతి పండుగలా మారింది.



