ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున నోయిడాలో జరిగిన ఓ ప్రేమకథ విషాదాంతంగా ముగిసింది. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న యువకుడు–యువతి కథ రక్తపాతంతో ముగియడం స్థానికంగా సంచలనం రేపింది.
నోయిడాలోని సెక్టార్-39 పోలీస్ స్టేషన్ పరిధిలో, దాద్రి రోడ్డులో పిల్లర్ నంబర్ 84 సమీపంలో ఆగి ఉన్న కారులో ఇద్దరి మృతదేహాలు పోలీసులు గుర్తించారు. కారు లోపల నుంచే లాక్ అయి ఉండగా, ఇద్దరి తలలకు తుపాకీ గాయాలు ఉన్నాయి. కారులో నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సుమిత్ ముందుగా రేఖను కాల్చి హత్య చేసి, అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, సుమిత్ (సుమారు 31 ఏళ్లు), రేఖ (సుమారు 26 ఏళ్లు) గత 15 సంవత్సరాలుగా పరిచయం ఉండి ప్రేమలో ఉన్నారు. సుమిత్ ఆమెను వివాహం చేసుకోవాలని భావించగా, రేఖకు మరోచోట పెళ్లి నిశ్చయమైందని సమాచారం. ఈ అంశమే ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమై, వాగ్వాదం చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కలిసి ఉండలేమన్న వాస్తవం సుమిత్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసి ఈ ఘోర నిర్ణయానికి దారి తీసిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో, విదేశీ నంబర్ నుంచి ఫోన్ చేసి తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని సుమిత్ కుటుంబం ఆరోపిస్తోంది. యువతి నివాసానికి అర కిలోమీటరు దూరంలోనే కారు లభించిందని వారు చెబుతున్నారు. ఆ కారు సుమిత్ పేరుపైనే నమోదు అయి ఉంది. తమ కొడుకును హత్య చేశారని, ఈ వ్యవహారం కుల వివాదంతో ముడిపడి ఉందని యువకుడి కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, శుక్రవారం నుంచే ఇద్దరూ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపగా, ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. కేసుకు గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఏసీపీ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ, యువతి కార్యాలయం నుంచి ఎప్పుడు బయలుదేరిందో, యువకుడు ఆమెను ఎక్కడ కలిశాడో తెలుసుకునేందుకు ఇప్పటివరకు 50కి పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించినట్టు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలు, డిజిటల్ ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.



