ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరు దుర్వినియోగం: నకిలీ సంస్థలపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు

తమ పేరును పోలిన పేర్లతో రిజిస్టర్ అయి ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సంస్థలు, వ్యక్తులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మోసపూరిత సంస్థలపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చేపట్టిన చర్యలపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని గురువారం స్పష్టం చేసింది.

ఇటీవల తమ దృష్టికి వచ్చిన ఒక ఘటనను కమిషన్ ఉదహరించింది. ఢిల్లీ ప్రభుత్వంలో 2022లో ‘నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)’ అనే పేరుతో ఓ ఎన్‌జీవో రిజిస్టర్ అయిందని ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఆ సంస్థ తమకు నీతీ ఆయోగ్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖల గుర్తింపు ఉందని ప్రచారం చేసుకుంటోందని పేర్కొంది. కర్ణాటకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఈ సంస్థకు ‘స్టేట్ చైర్మన్’గా వ్యవహరిస్తున్నట్లు కూడా తేలిందని వెల్లడించింది.

ఈ వ్యవహారం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కమిషన్ సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరును పోలిన మోసపూరిత పేర్లు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, ఈ సంస్థలు కమిషన్‌లో భాగమన్నట్లుగా లేదా తమచే గుర్తింపు పొందినట్టుగా భ్రమ కల్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల కమిషన్‌పై ప్రజల నమ్మకం దెబ్బతినడమే కాకుండా నిధుల దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఇలాంటి ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరును దుర్వినియోగం చేస్తున్న సంస్థలను గుర్తించి వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో పాటు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రత్యేకంగా, ఢిల్లీలో రిజిస్టర్ అయి కర్ణాటకలో కార్యకలాపాలు సాగిస్తున్న సదరు నకిలీ సంస్థపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి