కొత్త గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయ్.. కేవలం రూ.300కే లైట్ వెయిట్ సిలిండర్

గ్యాస్ సిలిండర్ల రూపం త్వరలోనే పూర్తిగా మారబోతోంది. ఇప్పటివరకు ఎల్పీజీ సిలిండర్ అనగానే ఎరుపు రంగులో ఉండే, ఇనుముతో తయారైన బరువైన సిలిండర్‌నే మనం ఊహించుకుంటాం. కాలక్రమేణా పాతబడిపోయి, తుప్పు పట్టి, మట్టితో మసకబారిన రూపంలో ఇవి కనిపిస్తుంటాయి. ఇనుముతో తయారైన కారణంగా వీటి బరువు ఎక్కువగా ఉండటంతో, కదిలించడం లేదా పైకి ఎత్తడం చాలా మందికి ఇబ్బందిగా మారింది.

అయితే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల రంగంలోనే ఓ సరికొత్త విప్లవం రాబోతోంది. ఇకపై అత్యంత తేలికబరువుతో, ఆకర్షణీయమైన లుక్‌తో ఉండే మోడ్రన్ గ్యాస్ సిలిండర్లు వినియోగంలోకి రానున్నాయి. వీటిని ‘మోడ్రన్ గ్యాస్ సిలిండర్లు’గా పిలుస్తున్నారు.

కంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్లు

మార్కెట్‌లోకి కొత్త తరహా గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే ప్రవేశించాయి. హై డెన్సిటీ పాలిథిలిన్ (HDPE) అనే ఆధునిక మెటీరియల్‌తో తయారైన ఈ సిలిండర్లను ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) విడుదల చేసింది. ‘భారత్ గ్యాస్ లైట్’ పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఈ కొత్త సిలిండర్ల ప్రత్యేకత ఏమిటంటే, గ్యాస్ పూర్తిగా నింపినప్పటికీ బరువు చాలా తక్కువగా ఉంటుంది. గ్యాస్ ఫుల్‌గా ఉన్నా కూడా ఈ సిలిండర్ మొత్తం బరువు కేవలం 15.9 కిలోలే. సంప్రదాయ ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఇది దాదాపు సగం బరువే కావడం విశేషం. అంతేకాదు, భద్రత పరంగానూ ఇవి మరింత మెరుగైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ లీక్ అయినా ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. లీక్ నెమ్మదిగా జరగడం వల్ల సిలిండర్‌లో ప్రెజర్ ఒక్కసారిగా పెరగదు.

కేవలం రూ.300కే కొత్త సిలిండర్

పాత ఇనుప గ్యాస్ సిలిండర్లు సాధారణంగా 80 కిలోల వరకు ప్రెజర్‌ను మాత్రమే తట్టుకుంటాయి. అయితే ఈ కొత్త కంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్లు 120 కిలోల వరకు ప్రెజర్‌ను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇవి బ్లూ, ఎల్లో రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఇంకొక ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే, ఈ సిలిండర్‌లో గ్యాస్ ఎంత మిగిలి ఉందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. సిలిండర్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారదర్శక కిటికీ ద్వారా గ్యాస్ లెవల్‌ను చూడవచ్చు. ఇనుప సిలిండర్లలో కనిపించే తుప్పు, మరకలు వంటి సమస్యలు వీటిలో ఉండవు. ప్లాస్టిక్‌తో తయారు చేసినందువల్ల దీర్ఘకాలం కొత్తగానే కనిపిస్తాయి.

ఈ కొత్త సిలిండర్ అసలు ధర రూ.3,350గా ఉంది. అయితే పాత ఇనుప సిలిండర్‌ను రిటర్న్ ఇస్తే, కేవలం రూ.300 మాత్రమే చెల్లించి ఈ కొత్త ‘భారత్ గ్యాస్ లైట్’ సిలిండర్‌ను పొందే అవకాశం ఉందని బీపీసీఎల్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి