నెల్లూరు జిల్లా వర్షాల దెబ్బకు తీవ్రంగా అల్లకల్లోలమైంది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు నగరాన్ని జలదిగ్భంధంలోకి నెట్టాయి. రోడ్లు, వీధులు, కాలనీలు—అన్నీ వరద నీటితో నిండిపోవడంతో సాధారణ జన జీవనం పూర్తిగా స్థంభించింది. నగరం మొత్తం ఒక పెద్ద చెరువులా మారిపోయింది. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టతరమైంది. పలు ప్రాంతాల్లో నీరు నేరుగా నేషనల్ హైవే మీదికి చేరి రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అత్యవసర సేవలు ఏకకాలంలో రంగంలోకి దిగడంతో కొంత ఉపశమనం కనిపించడం ప్రారంభమైంది.
‘దిత్వా’ తుపాను ప్రభావం నెల్లూరుపై గట్టిగానే పడింది. వర్షం కురిసిన తీరును చూసి వాతావరణ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలప్రళయం తలపించే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. శివారు కాలనీల్లో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుని పనులు లేక పస్తులుండిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు వద్ద స్వర్ణముఖి నది భారీగా ప్రవహిస్తూ పరిసరాల్లో హెచ్చరిక వాతావరణాన్ని సృష్టించింది. మరోవైపు సోమశిల, కండలేరు వంటి ప్రధాన డ్యాంలకు పైఎత్తు నుంచి వరద నీరు పెద్దఎత్తున చేరుతోంది.
పెన్నా, కైవల్య, స్వర్ణముఖి, కాళంగి నదులు అనేక చోట్ల ఉధృతరూపం దాల్చాయి. వాగులు, వంకలు, చిన్నకాలువలు కూడ పెద్దనదులలా మారాయి. పొట్టేపాళెం కలుజు వద్ద మట్టిరోడ్డే కొట్టుకుపోవడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాకాడు మండలం కొండూరుపాళెం వరద నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాళెం వద్ద ఉప్పుటేరు వాగు ఉద్ధృతంగా పొంగిపొర్లి గ్రామాన్ని జలదిగ్భంధంలోకి నెట్టింది.
కోట మండలం పుచ్చలపల్లి వద్ద స్వర్ణముఖి నది పొర్లుకట్టలు బలహీనంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ముప్పు పెరగడంతో దైవాలదిబ్బ ప్రాంతానికి చెందిన కుటుంబాలను అత్యవసరంగా సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ చర్యతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
నెల్లూరు నగర శివార్లు ఇప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేకపోతున్నాయి. తిప్పవరప్పాడు ప్రాంతంలో వరద నీరు గట్టిగా ప్రవహిస్తూ రవాణా మార్గాలను పూర్తిగా మూసివేసింది. గూడూరు–సైదాపురం మార్గం వరద నీటితో నిండిపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. సైదాపురం మండలంలో మావిలేరు, పిన్నేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలు బయటికి రావడమే కష్టంగా మారింది. సైదాపురం–పొదలకూరు మార్గం దాదాపు అందుబాటులో లేకుండా పోయింది.
చిల్లకూరు మండలంలోని పాలిచెర్లవారిపాళెం వద్ద రోడ్డుపై వరద నీరు ప్రవహించడం వల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చిల్లకూరు–చింతవరం రూట్ పరిస్థితి కూడా ఇదే రీతిగా దుర్భరంగా మారింది.
పేరారెడ్డిపల్లి, బీసీ కాలనీలు వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకే వరద నీరు దూసుకెళ్లింది. సైదాపురం మండలంలో పిన్నేరు వాగు కాజ్‌వేపై వరద ప్రవహించడంతో బుధవారం రాత్రి నుంచి సైదాపురం–పొదలకూరు రహదారి పూర్తిగా మూసివేయబడింది.
ఈ భారీ వర్షాల ప్రభావం నెల్లూరుతో పాటు పొదలకూరు, మనుబోలు, కోవూరు, వెంకటాచలం, ముత్తుకూరు, కొండాపురం మండలాల్లో అత్యధికంగా నమోదైంది. ఇప్పటికీ వర్షం తేలికపడినా పలు ప్రాంతాల్లో నిల్వ నీరు తగ్గడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. అధికారులు అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.



