భారతదేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందిన నీట్ యూజీ (NEET UG)లో విజయం సాధించడం డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థి కల. అయితే ఆ కలను నిజం చేసుకోవడానికి అనేక సామాజిక, ఆర్థిక అడ్డంకులను దాటాలి. అలాంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని, ఐదో ప్రయత్నంలో నీట్‌ను క్వాలిఫై చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు రాజస్థాన్‌లోని ఓ చిన్న జిల్లా వాసి రాంలాల్.
చిన్న వయసులోనే భుజాలపై బాధ్యతలు
రాంలాల్ జీవితంలో బాధ్యతలు చాలా తొందరగానే మొదలయ్యాయి. ఆరో తరగతి చదువుతున్న దశలోనే, అంటే కేవలం 11 ఏళ్ల వయసులో ఆయనకు వివాహం జరిగింది. తోటి పిల్లలు ఆటపాటలతో బాల్యాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో, రాంలాల్ మాత్రం కుటుంబ బాధ్యతల బరువును మోసాల్సి వచ్చింది. 20 ఏళ్ల వయసుకు చేరుకునేలోపే ఆయనకు ఒక బిడ్డ కూడా జన్మించాడు. బాల్య వివాహం కుటుంబ నిర్ణయం కావడంతో అప్పట్లో దానికి ఎదురు చెప్పే పరిస్థితి ఆయనకు లేదు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉందని తండ్రికి చెప్పినప్పటికీ, ఆశించిన ప్రోత్సాహం లభించలేదు.
అండగా నిలిచిన భార్య
కష్టసమయంలో రాంలాల్‌కు అతిపెద్ద బలం ఆయన భార్యే. ఆమె స్వయంగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నవారు. భర్త కలను అర్థం చేసుకున్న ఆమె, ఆయన చదువుకు మానసికంగా అండగా నిలిచారు. కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని, రాంలాల్ తన లక్ష్యంపై దృష్టి పెట్టేందుకు అవసరమైన సహకారాన్ని అందించారు. భార్య మద్దతు లేకపోతే తన కల ఎప్పుడో మధ్యలోనే ఆగిపోయేదని రాంలాల్ భావోద్వేగంగా చెబుతారు.
ఓటమిని గెలుపుగా మార్చుకున్న ప్రయాణం
పదో తరగతిలో 74 శాతం మార్కులు సాధించిన రాంలాల్ సైన్స్ గ్రూప్‌ను ఎంచుకున్నారు. 2019లో తొలిసారి నీట్ పరీక్ష రాయగా, 720 మార్కులకు గాను కేవలం 350 మార్కులు మాత్రమే వచ్చాయి. ఆ ఓటమి ఆయనను కుంగదీయలేదు. పట్టుదలతో కోచింగ్ తీసుకుంటూ మరింత కష్టపడ్డారు. 2022లో రాసిన నీట్‌లో 490 మార్కులు సాధించి, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు.
చివరికి ఐదో ప్రయత్నంలో నీట్‌ను క్వాలిఫై చేసి, వైద్య విద్య చదివే అవకాశాన్ని దక్కించుకున్నారు. చిన్న గ్రామం నుంచి వచ్చి, బాల్య వివాహం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాంలాల్ సాధించిన ఈ విజయం లక్షలాది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పట్టుదల, సహనం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా జయించవచ్చని ఆయన జీవితం నిరూపిస్తోంది.



