దేశవ్యాప్తంగా నక్సల్స్ వర్గాల్లో సంచలనం సృష్టించిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి లొంగిపోవడం ఇప్పుడు సామాజిక, రాజకీయ, పోలీసు, ఇంటలిజెన్స్ వర్గాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది. దశాబ్దాలుగా దట్టమైన అరణ్యాల్లో సాయుధ పోరాటాన్ని నడిపిన ఈ నామవంతుడైన నాయకుడు, చివరికి తనతో పాటు 60 మంది నక్సల్స్‌తో కలిసి పోలీసుల ముందు లొంగిపోయాడు.
నక్సల్ ఉద్యమానికి వ్యూహాత్మక మేధావి
భూపతి నిషేధిత పీపుల్స్ వార్ గ్రూప్ (P.W.G) వ్యవస్థాపక కేడర్‌లో కీలక స్థానంలో ఉన్నాడు. మహారాష్ట్ర–చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు ప్రాబల్యం పెరగడంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు. ఆయన వ్యూహాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నక్సల్స్‌పై కూడా బలమైన ప్రభావం చూపాయి.
భూపతిపై ప్రభుత్వం రూ. 6 కోట్ల బహుమతి ప్రకటించింది. దశాబ్దాలుగా అరణ్య జీవనాన్ని గడిపిన భూపతి, “సాయుధ పోరాటమే జీవితం” అన్న నమ్మకంతో సాగిన వ్యక్తి. అయితే ఇప్పుడు అదే వ్యక్తి చట్టం ముందు తలవంచడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సరెండర్ వెనుక వ్యూహం లేదా మానసిక మార్పు?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ “నక్సల్ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తాం” అని చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో, గత నెలరోజులుగా తెరవెనుక మంతనాలు జరిగాయి. ఈ పరిణామాలు, భూపతిని మరో మార్గం ఎంచుకునేలా చేసాయా? లేక మరేదైనా వ్యూహాత్మక ఒప్పందం ఉందా? అనేది ఇప్పటికీ తెలియాల్సి ఉంది.
69 ఏళ్ల భూపతి, మావోయిస్టు సెంట్రల్ కమిటీ మరియు పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా. ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం —
“భూపతి వంటి ధైర్యసాహస నేతలో ఇటీవల ఆత్మనూన్యత పెరిగింది. రక్షణలేని పరిస్థితి, నిరంతర ఒత్తిడి – ఇవన్నీ ఆయన సరెండర్‌కు దారితీశాయి.”
భార్య సరెండర్‌తోనే సంకేతాలు ప్రారంభం
ఈ ఏడాది ప్రారంభంలో భూపతి భార్య తారక్క కూడా లొంగిపోయింది. అప్పటినుంచే భూపతి సరెండర్ సూచనలు బలంగా వినిపించాయి.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు “సాయుధ పోరాటం ఇక ప్రయోజనరహితం” అన్న భావన బలపడింది. విప్లవ సిద్ధాంతం విఫలమైందనే ఆలోచన ఆయనలో స్థిరపడిందని చెబుతున్నారు.
పోలీసుల వ్యూహాత్మక సమన్వయం
సరెండర్ సంకేతాలు రావడంతో ఇంటలిజెన్స్ విభాగం వెంటనే కదిలింది. పోలీసులు ఆయనను వెంబడించడం మానేసి, సరెండర్‌కు అనుకూల వాతావరణం సృష్టించారు. భమర్‌గఢ్ ప్రాంతంలో నమ్మకస్తుల ద్వారా సంప్రదింపులు జరిగాయి.
“ఇంతకాలం చట్టానికి అతీతంగా వ్యవహరించిన వ్యక్తి చట్టం ముందు లొంగిపోతే, భద్రత కల్పిస్తామనే హామీ ఇచ్చాం,” అని పోలీసు అధికారులు తెలిపారు.
సరెండర్‌కు ముందు ప్రజలతో చివరి భేటీ
పదిరోజుల క్రితం భూపతి, కొందరు నక్సల్స్‌తో కలిసి ఫోడేవాడా ప్రాంతం గ్రామస్తులతో మాట్లాడాడు.
“ఇక అడవుల్లో జీవితం ముగిసింది, విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది,” అని ఆయన ఆ సమయంలో గ్రామస్థులతో చెప్పినట్లు సమాచారం.
అక్టోబర్ 13: కీలక రోజు
తెరవెనుక మంతనాలు అక్టోబర్ 13న ముగిశాయి. అదే రోజు భూపతిని ఓ పోలీసు అధికారి కలిశారు. తర్వాత అధికారికంగా ఆయన సరెండర్‌ను ప్రకటించారు. మహారాష్ట్రలోని హోదారి కుగ్రామం వద్ద, ఆయన తన భారీ బృందంతో కలిసి లొంగిపోయాడు.
నక్సల్ ఉద్యమానికి “సంధ్యాకాలం”
భూపతి సరెండర్‌తో నక్సల్ ఉద్యమం మరింత బలహీనమైందనే సంకేతాలు వస్తున్నాయి.
భూపతి బృందంలో 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, మొత్తం 60 మంది మావోయిస్టులు, మరియు 54 ఆయుధాలు అప్పగించారు.
ఈ పరిణామం నక్సల్స్ భవిష్యత్ దిశపై పౌర సమాజం, మేధావులు, పోలీసు వర్గాల్లో పలు ప్రశ్నలకు దారితీసింది. సాయుధ పోరాట మార్గం విఫలమైందనే మల్లోజుల స్పష్టమైన అవగాహన, ఇప్పుడు మావోయిస్టు చరిత్రలో ఒక కొత్త మలుపును సృష్టించింది.



