మంగళగిరిలో నారా బ్రాహ్మణి విస్తృత పర్యటన – చేనేత, మహిళా శిక్షణా కేంద్రం, పార్క్, ఉచిత బస్సు సేవల పరిశీలన

మంగళగిరి:
రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి, టీడీపీ నాయకురాలు నారా బ్రాహ్మణి మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేపట్టారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు స్థితిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తూ, ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్శనలో భాగంగా నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలను ఆమె సందర్శించారు.

మొదటగా, మంగళగిరి చేనేత వస్త్ర పరిశ్రమకు ఉన్న ప్రత్యేకతను గుర్తుచేసుకుంటూ, అక్కడి కార్మికులు రూపొందించిన కొత్త డిజైన్లను ఆసక్తిగా వీక్షించారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని, కృషిని అభినందిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, చేనేత రంగం అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు.

తరువాత, కాజలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రంను బ్రాహ్మణి సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న నైపుణ్యాలు, శిక్షణ ద్వారా లభిస్తున్న ఉపాధి అవకాశాలు, ఆర్థిక లాభాలపై వివరాలు తెలుసుకున్నారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు ఈ తరహా కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత, పిల్లల వినోదం కోసం నిర్మించిన కొత్త పార్కును పరిశీలించిన బ్రాహ్మణి, ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులతో సరదాగా గడిపారు. పార్కులోని ఉయ్యాలపై ఊగడం, పిల్లలతో మాటలాడడం ఈ పర్యటనలో ఆకర్షణీయ ఘట్టాలుగా నిలిచింది.

తరువాత, శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించిన ఉచిత బస్సు సర్వీసును పరిశీలించారు. బస్సులో ప్రయాణిస్తున్న భక్తులతో నేరుగా మాట్లాడుతూ, అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఈ సేవతో తమ ప్రయాణం సులభతరం అయ్యిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయానికి చేరుకుంటున్నామని భక్తులు తెలియజేశారు.

ఈ పర్యటనలో, బ్రాహ్మణి నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంతో పాటు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు కూడా ఇచ్చారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి