నటసింహం నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. కథానాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, బ్రిటన్కు చెందిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనకు ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ అవార్డు ప్రకటించింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారు.
భారతీయ చలనచిత్ర రంగంలో యాభై ఏళ్ల పాటు హీరోగా కొనసాగడం చాలా అరుదైన విషయం. ఈ విశేష విజయాన్ని గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ, బాలకృష్ణ సినీ ప్రస్థానాన్ని విశేషంగా అభినందిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అవార్డును అందజేసే సన్మాన కార్యక్రమం ఆగస్టు 30న హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో బాలకృష్ణకు పురస్కారాన్ని అధికారికంగా అందజేయనున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నారా బ్రాహ్మణి శుభాకాంక్షలు
ఈ అరుదైన గుర్తింపుపై బాలకృష్ణ కుమార్తె, ప్రముఖ వ్యాపారవేత్త నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. “మా నాన్నగారు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. యాభై ఏళ్లుగా కథానాయకుడిగా కొనసాగడం అనేది ఒక అద్భుతమైన ఘనత. ఇప్పుడు ఈ ప్రయాణానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం మరింత గర్వకారణం” అని ఆమె పేర్కొన్నారు.
బ్రాహ్మణి తన తండ్రిని ప్రశంసిస్తూ, “మీరు నిజంగా అసామాన్య శక్తి. తెరపై మీరు ఐకాన్ అయితే, వ్యక్తిగతంగా కరుణామయుడైన నాయకుడు. మీ అద్భుతమైన ప్రస్థానానికి ఇలాంటి గుర్తింపు రావడం మా గర్వకారణం. మీరు మా హీరో” అంటూ హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.



