హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం మధ్యాహ్నం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బచాస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉండగా… వారిని రక్షించేందుకు ప్రాణాలను లెక్కచేయకుండా లోపలికి వెళ్లిన మరో ఇద్దరు యువకులు కూడా అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ప్లాస్టిక్, ఫైబర్, లెదర్‌తో పాటు ఫర్నిచర్ పాలిష్‌కు ఉపయోగించే కెమికల్స్ భారీగా దహనమవడంతో విషపూరిత నల్లటి పొగ ఒక్కసారిగా భవనం అంతటా వ్యాపించింది. ఊపిరి ఆడక పలువురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
నాలుగు అంతస్తుల ఈ భవనానికి కింద రెండు సెల్లార్లు ఉన్నాయి. ఒక సెల్లార్‌ను గోదాంగా ఉపయోగిస్తుండగా, మరో సెల్లార్‌లో షోరూమ్ కార్మికుల కుటుంబాలు నివసిస్తున్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం సుమారు 12:40 గంటల సమయంలో గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల నిల్వ ఉంచిన ఫైబర్, లెదర్ సామగ్రి, కెమికల్స్ కారణంగా క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చి భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి.
ఈ సమయంలో సెల్లార్‌లోని ఒక గదిలో వాచ్‌మన్ బేబీ (43), కార్మికుడు యాదయ్య కుమారులు అఖిల్ (12), ప్రణీత్ (9) మంటల మధ్య చిక్కుకున్నారు. చిన్నారుల ఆర్తనాదాలు విన్న షోరూమ్ ఉద్యోగి మహ్మద్ ఇంతియాజ్ (27), అదే షోరూమ్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న హబీబ్ (40) ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని కాపాడేందుకు సెల్లార్‌లోకి దూసుకెళ్లారు. అయితే లోపల ఆక్సిజన్ కొరత, దట్టమైన విషపూరిత పొగ కారణంగా వారు కూడా బయటకు రాలేకపోయారు. ఇతరులను రక్షించాలన్న వారి ధైర్యమే చివరకు ప్రాణత్యాగంగా మారింది.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుంది. దాదాపు 10 గంటల పాటు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే సెల్లార్‌లోకి వెళ్లేందుకు మార్గం ఇరుకుగా ఉండటం, లోపల అధికంగా పొగ నిండి ఉండటంతో సహాయక చర్యలు తీవ్రంగా కష్టపడ్డాయి.
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి గోడలను డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాయి. ఫైర్ రోబోట్లను వినియోగించినప్పటికీ పరిస్థితి అనుకూలించలేదు. ఫైర్ ఇంజిన్లు చల్లిన నీరు సెల్లార్‌లో నిలిచిపోవడం, భద్రతా చర్యల దృష్ట్యా విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ మొత్తం ప్రక్రియను సీపీ సజ్జనార్, మేయర్ విజయలక్ష్మి, కలెక్టర్ హరిచందన స్వయంగా పర్యవేక్షించారు.
ఇదిలా ఉండగా, షోరూమ్‌లో పనిచేస్తున్న యాదయ్య, లక్ష్మి దంపతులు అగ్నిప్రమాదానికి కొద్దిసేపటి ముందు పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఈ ఘోరం జరగడంతో తమ ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
జనసాంద్రత ఎక్కువగా ఉండే భవనాల్లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, కేవలం ఒకే ఎంట్రీ–ఎగ్జిట్ మార్గం ఉండటం వంటి అంశాలు ఈ ప్రాణనష్టానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.



