నూతన సంవత్సర వేళ నకిలీ SMS/WhatsApp లింకులపై హెచ్చరిక— తెలంగాణ సైబర్ క్రైమ్

నూతన సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మళ్లీ చురుగ్గా మారారని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షల పేరుతో వచ్చే నకిలీ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలు, అలాగే సోషల్ మీడియా ఖాతాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నూతన సంవత్సరం సందర్భంగా గిఫ్టులు, క్రెడిట్ కార్డు ఆఫర్లు, భారీ రాయితీలు, లక్కీ డ్రాలు అంటూ ఆకర్షణీయమైన లింకులను పంపిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నకిలీ లింకులను క్లిక్ చేస్తే వినియోగదారులు ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

అనాలోచితంగా లింకులపై క్లిక్ చేయడం వల్ల మొబైల్ ఫోన్లలో హానికరమైన యాప్‌లు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. దాంతో బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అనుమానాస్పద లింకులు, తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి