తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి ఆత్మహత్య చేసుకోవడం, అనంతరం అతడి ముగ్గురు చిన్నారుల మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే… వెల్దండ మండలానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు ఎరువుల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్యతో విభేదాలు రావడంతో గత నెల 30న ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు.
అదే రోజు పెద్దాపూర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్ల మృతదేహం లభించింది. అతని పక్కనే పురుగుమందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్యగా పోలీసులు నమోదు చేశారు. కానీ, అతడితో పాటు వెళ్ళిన పిల్లల ఆచూకీ మాత్రం దొరకలేదు.
డిండి ప్రాజెక్టు పరిసరాల్లో తండ్రి పిల్లలతో సంచరించినట్లు సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మంగళవారం రాత్రి నుండి గాలింపు చర్యలు మరింత వేగవంతం చేశారు.
గురువారం ఉదయం ఉప్పనుంతల మండలం సూర్యా తండా సమీపంలో ఆరుగేళ్ల చిన్న కుమార్తె వర్షిణి, నలుగేళ్ల కుమారుడు శివధర్మ మృతదేహాలు లభించాయి. అదేవిధంగా తాండ్ర గ్రామ సమీపంలో ఎనిమిదేళ్ల పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం బయటపడింది.
ముగ్గురు చిన్నారులను పెట్రోలు పోసి తగులబెట్టినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.



