ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” త్వరలో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిష్ఠాత్మక అకాడమీకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో ఎం.ఎస్.కె ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు, పలువురు క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు.
దేశానికి ప్రతిభావంతమైన యువ క్రికెటర్లను తయారు చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు ఎం.ఎస్.కె ప్రసాద్ తెలిపారు. అమరావతిలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ అకాడమీ కేవలం శిక్షణా కేంద్రంగానే కాకుండా ప్రపంచ స్థాయి క్రీడా సముదాయంగా అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు.
ఈ అకాడమీ ద్వారా స్థానిక క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడంతో పాటు వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని ప్రసాద్ తెలిపారు. అమరావతిలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మలుపు తిప్పే ఘట్టంగా నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సమీకృత ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ మైదానం, పలు ప్రాక్టీస్ గ్రౌండ్లు, ఆధునిక ఇండోర్ ట్రైనింగ్ సదుపాయాలు, అత్యాధునిక నెట్స్, క్రీడాకారుల ప్రదర్శనను విశ్లేషించే సాంకేతిక వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా, క్రీడలతో పాటు విద్యకు ప్రాధాన్యతనిస్తూ అంతర్జాతీయ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ఇందులో భాగంగా నిర్మించనున్నారు.
క్రీడాకారులు, సందర్శక జట్ల కోసం వసతి గృహాలు, హాస్టల్ సదుపాయాలు, అలాగే మినీ స్టేడియం, మోడర్న్ జిమ్, ఫిజియోథెరపీ మరియు రెహాబిలిటేషన్ సెంటర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి.
అమరావతిని దక్షిణ భారతదేశంలో ప్రధాన క్రీడా హబ్‌గా మార్చే లక్ష్యంతో సీఆర్డీఏ ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందని అధికారులు వెల్లడించారు.



