ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, నిద్రలేమి, జీవనశైలి మార్పులు ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. జుట్టు సమస్యను తగ్గించేందుకు చాలామంది మార్కెట్‌లో లభించే నూనెలు, హెయిర్ మాస్క్‌లను ఉపయోగిస్తున్నా, అంతర్గత పోషణ లేకపోతే శాశ్వత పరిష్కారం దొరకదు.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేయాలి. అందుకు వంటగదిలో సులభంగా లభించే కొన్ని సహజ పదార్థాలతో తయారుచేసే పానీయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి తల చర్మాన్ని డీటాక్స్ చేయడమే కాకుండా జుట్టు మూలాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
మెంతి నీళ్లు
మెంతులలో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేసి రాలడాన్ని తగ్గిస్తాయి.
రాత్రి ఒక చెంచా మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కొత్త వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది.
ఉసిరి (గూస్‌బెర్రీ) పానీయం
ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి తల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎండిన ఉసిరికాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగితే జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
కొత్తిమీర నీళ్లు
కొత్తిమీర ఆకుల్లో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి తలకు అవసరమైన పోషణను అందిస్తాయి.
కొత్తిమీర ఆకులను నీటిలో మరిగించి వడకట్టి, ప్రతిరోజూ ఉదయం తాగడం మంచిది.
అలోవెరా నీళ్లు
అలోవెరాలో అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను పునరుజ్జీవింపజేస్తాయి.
ప్రతిరోజూ ఉదయం రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.
తులసి నీళ్లు
తులసిలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
కొన్ని తులసి ఆకులను నీటిలో మరిగించి ఉదయం తాగడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి.
దాల్చిన చెక్క నీళ్లు
దాల్చిన చెక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల తలకు పోషకాలు సరిగ్గా చేరుతాయి.
దాల్చిన చెక్క ముక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగాలి.
ఈ పానీయాలను క్రమం తప్పకుండా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జుట్టు రాలడం తగ్గి, సహజంగా ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది.



