Alert : కాకినాడ వద్ద మొంథా తుపాన్ కలకలం – మారిన దిశ, మచిలీపట్నం వైపు దూసుకెళ్తున్న తుపాను!

ఏపీలో మొంథా తుపాను ఉధృతి కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఉత్పన్నమైన ఈ తుపాను తూర్పు తీరం వైపు వేగంగా దూసుకువస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలన్నీ ముప్పు మోస్తున్నాయి. తుపాను దిశగా కదులుతుండటంతో తీర జిల్లాలన్నింటిలోనూ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అయితే ఇవాళ ఉదయం అతి తీవ్ర తుపానుగా మారినప్పటికీ ఆశించినంత వర్షపాతం కనిపించకపోవడంతో ప్రజలు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఈదురుగాలులు మాత్రం గంట గంటకు వేగం పెంచుతున్నాయి. సముద్రం ఉప్పొంగిపోతుండగా, అలలు ఎగిసిపడుతూ భయాందోళన సృష్టిస్తున్నాయి.

మొదట కాకినాడ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసిన మొంథా తుపాను ఇప్పుడు దిశ మార్చుకుంటూ మచిలీపట్నం వైపు కదులుతోందని వాతావరణశాఖ తాజా బులిటెన్ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉదయం 11.30 గంటలకు విడుదల చేసిన వివరాల ప్రకారం — మొంథా ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారింది. గత ఆరు గంటల్లో ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతానికి ఈ తుపాన్ మచిలీపట్నం నుండి 160 కిమీ, కాకినాడ నుండి 240 కిమీ, విశాఖపట్నం నుండి 320 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది ఈరోజు రాత్రికి కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

మొంథా ప్రభావంతో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తీరప్రాంతాల్లో ఇవాళ అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులకు సముద్రయాత్రలపై నిషేధం విధించారు.

ప్రస్తుతం మొంథా తుపాను గంటకు 12 కిమీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఈ వేగం కొనసాగితే వచ్చే ఐదు గంటల్లో ఇది మచిలీపట్నం సమీప తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని అంచనా. తొలుత కాకినాడ వద్ద తీరం దాటుతుందని భావించినా ఇప్పుడు దిశ మార్పుతో మచిలీపట్నం ప్రాంతం ప్రధాన ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

తుపాను ప్రభావం కారణంగా తీరప్రాంత ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది. అత్యవసర సేవా బృందాలు, నదీ రక్షక దళాలు సిద్ధంగా ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి