కోస్తా ఆంధ్ర ప్రాంతంపై మొంథా తుపాన్ ప్రభావం వేగంగా పెరుగుతోంది. నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి, భారత వాతావరణశాఖ దానికి “మొంథా” అనే పేరు ఇచ్చింది. గడిచిన మూడు గంటల్లో ఈ తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
ప్రస్తుతం తుపాన్ కేంద్రం చెన్నైకి , విశాఖపట్నానికి , కాకినాడకి సమీప దూరంలో ఉన్నట్లు సమాచారం. తుపాన్ ప్రభావంతో తీరప్రాంతాల్లో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. తుపాన్ తీరం చేరువవుతున్న కొద్దీ వాతావరణంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
తుపాన్ తీవ్రత దృష్ట్యా భారత వాతావరణశాఖ ఏపీ తీర జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది.
- సోమవారం: 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్.
- మంగళవారం (అక్టోబర్ 28): 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తుపాన్ ప్రభావం కొనసాగుతుండటంతో గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ప్రస్తుతం విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో అప్రమత్తంగా ఉంచబడ్డాయి. తుపాన్ తాకిడికి ముందు ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని APSDMA పిలుపునిచ్చింది.



