ప్రేమికుల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. విదేశాలకే పరిమితం కాకుండా భారత్‌లో కూడా ఈ సంస్కృతి యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా, కాలేజీ పనులని, ఆఫీస్ పనులని చెప్పుకుని ప్రేమికులు జంటలుగా బయట తిరుగుతూ కనిపిస్తుంటారు. ఫిబ్రవరి 14కి వారం రోజుల ముందే ఈ సందడి మొదలవుతుంది. ఫిబ్రవరి 7న రోజ్‌డేతో ప్రారంభమై, ప్రపోజ్డే, చాక్లెట్డే, టెడ్డీడే, ప్రామిస్‌డే, హగ్డే, కిస్‌డే అంటూ చివరకు ప్రేమికుల దినోత్సవానికి చేరుకుంటుంది.
ఈ వారం రోజుల పాటు రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, పబ్బులు, పబ్లిక్ ప్లేసులు ప్రేమికులతో కళకళలాడుతుంటాయి. అటు అబ్బాయి, ఇటు అమ్మాయి… ఇద్దరూ తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంటారు. కానీ ఒకవేళ అదే ప్రేమ విషయం పేరెంట్స్‌కు తెలిసిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లి తన కుమారుడిని లవర్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నకు సమాధానంగా నిలిచే ఓ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక తల్లి మెట్రో స్టేషన్లో తన కుమారుడిని చూసింది. అతడి పక్కనే ఓ యువతి ఉంది. క్షణాల్లోనే ఆమె ఎవరో గుర్తించింది. ఆ యువతి తన కుమారుడి గర్ల్‌ఫ్రెండ్ అని అర్థమవడంతో… ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడే అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. అదే మెట్రో స్టేషన్లో వారి ఎంగేజ్మెంట్ నిర్వహించింది. సంప్రదాయ పద్ధతిలో యువతికి పళ్లు పెట్టి, స్వీట్లు పంచింది.
ఇక్కడ విశేషమేంటంటే… ఈ ఘటనలో తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. మొత్తం వ్యవహారాన్ని ఆయన మౌనంగా గమనిస్తూ నిలిచిపోయాడు. చివరికి కుమారుడి ప్రేమను అంగీకరించి, ఆ యువతిని కోడలిగా స్వీకరించాడు. అంతేకాదు… స్టేషన్లోనే జంటకు ఆశీర్వాదాలు కూడా అందించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “తన ప్రేమను తల్లిదండ్రులు ఇంత సానుకూలంగా అంగీకరించడం అదృష్టం” అంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “ఆ యువతి నిజంగా లక్కీ… ఇలాంటి అత్తామామలు దొరకడం అరుదు” అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు వేలల్లో లైక్స్ వచ్చాయి. లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. అయితే… ఈ సంఘటన ఏ ప్రాంతంలో జరిగింది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రావడం లేదు.



